ఈ బిల్లుపై కూడా ఆశలు వదులుకోవడమేనా..?
posted on Jul 20, 2016 @ 10:52AM
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై 22వ తేదీన ఓటింగ్ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది.. ?ఓటింగ్ లో ఏపీకి న్యాయం జరుగుతుందా..? లేదా..? ఓటింగ్ లో కనుక గెలిస్తే బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది..? అంటూ ఇలా అందరూ చూస్తున్నారు. మరోపక్క కేవీపీ బిల్లుకు మద్దతు పలకాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పార్టీ ఎంపీలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఎవరి వ్యూహంలో వారు ఉండగా.. బీజేపీ నేత హరిబాబు చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే మాత్రం ఈ బిల్లు ముందుకు సాగడం కష్టమేననిపిస్తుంది.
ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ ఎప్పటినుండో పాట పాడుతున్న సంగతి తెలిసిందే. ఏపీకి కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుంది.. ఇంకా ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకంటూ చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ బిల్లు ద్వారా అయినా ఏపీకి ప్రత్యేక హోదా సాధించవచ్చని అనుకుంటుంటే.. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ.. రాజ్యసభలో అసలు కేవీపీ బిల్లును చర్చకే రానివ్వమని ఆయన సంచలన ప్రకటన చేశారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. దీంతో హరిబాబు చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఈ బిల్లుపై కూడా ఆశలు వదిలేసుకోవడం మంచిది అనుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..