జులై 22న ఏం జరగబోతుంది..?
posted on Jul 19, 2016 @ 12:58PM
జులై 22 ఏపీకి రాష్ట్రానికి అత్యంత కీలకమైన రోజు. ఆరోజు ఏం జరగుతుంది.. ఆరోజు ఏపీ ప్రజలకు ఊరటనిస్తుందా.. లేక ఇంకా అంధకారంలోకి పడేస్తుందా.. ఇంతకీ ఆరోజున ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా.. ఏంటంటే ఏపీకి ప్రత్యేక హోదాపై ఓటింగ్ జరిగే రోజు. కేవీపీ రామచంద్రరావు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రైవేట్ మెంబల్ బిల్లు ప్రవేశ పెట్టారు. అయితే ఇప్పుడు దానిపై ఓటింగ్ 22వ తేదిన జరగనుంది దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి తరుణంలో ఓటింగ్ జరగనుంది. మరి ఈ ఓటింగ్లో ఏపీ ఓడిపోతుందా.. లేక గెలుస్తుందా.. అసలు బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. మొత్తం 245 మంది సభ్యులు గల రాజ్యసభలో ఎన్డీఏకు 72 మంది సభ్యులున్నారు. యూపీఏ తరఫున 66 మంది ఉండగా.. ఇంకా పలు పార్టీలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. మరి ఈనేపథ్యంలో అందరూ ఏపీ ప్రత్యేక బిల్లుకు ఓటింగ్ వేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇప్పటికే రాష్ట్రాన్ని విడగొట్టి పాపం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడైనా ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు ఓటింగ్ వేస్తే పాప ప్రక్షాళన చేసుకున్నట్టు. అలా చేస్తే కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. ఇక ఆరుగురు సభ్యులు సైతం టీడీపీ నేతలు ఎలాగూ ఓటు వేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఓట్లు, టీడీపీ నేతలు.. ఇంకా పలు పార్టీలకు చెందిన నేతలు కూడా ఏపీ కి బిల్లుకు మద్దతు పలికి ఓట్లు వేస్తే గెలిచినట్టే. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే 22 వరకూ ఆగాల్సిందే.