దూసుకుపోతున్న హిల్లరీ.. ట్రంప్ ఇప్పుడైనా మారతాడా..!
posted on Jul 19, 2016 @ 12:17PM
అమెరికా అధ్యక్ష పదవిపై ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ డొనాల్డ్ ట్రంప్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్నారు అందరూ. అంతే కాదు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ఆయన పాపులర్ అవ్వడానికి.. ఆయనకు ప్లస్ పాయింట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అవే ఆయనను ముంచేటట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న కంపు వల్ల ఇప్పుడు హిల్లరీకి మద్దతు పెరిగిపోతుంది. ఈనేపథ్యంలో ఆంగ్లో ఇండియన్స్ తమ మద్దతును హిల్లరీకి తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిల్లరీ గెలిస్తే అందరికీ మేలు జరుగుతుందని.. ట్రంప్ తో అంతా నాశనమే అవుతుందని ఆరోపించారు. అంతేకాదు ఆమె ప్రచారంలో ఎలాంటి తప్పులు చేయలేదు.. ఆమెకు అన్ని విషయాలపై అవగాహన ఉంది.. ఇప్పటికే తనను తాను నిరపూపించుకున్నారు అని అన్నారు. ఇంకా ట్రంప్ కు భారతీయులంటే పడదు.. ముస్లింలు గిట్టదు.. మెక్సికన్లు అంటే అసహ్యం.. అలాంటి ట్రంప్ చేతిలో దేశాన్ని పెడితే సర్వనాశనం అవుతుందని అన్నారు.
మరోవైపు ట్రంప్ పై మాత్రం విమర్శలు ఎక్కువయ్యాయి. గతంలో కూడా విమర్శలు ఉన్నా.. అప్పుడు గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు తాజాగా వెలువడ్డ అన్ని సర్వేల్లోనూ ట్రంప్ కంటే హిల్లరీకి 4 శాతం మేర విజయావకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ మద్దతు కూడా హిల్లరీకి లభించింది. దీంతో ఆమెకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుపుతున్నారు.
మరి ఇప్పుడైనా ట్రంప్ కాస్త తన నోటికి పని తగ్గిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలే ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడు అయితే సర్వనాశనం అవుతుందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాబట్టి కొన్ని రోజులు ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగ్గిస్తే గెలిచే అవకాశాలు ఉండవచ్చు. లేకపోతే ఇలానే కంటిన్యూ అయితే హిల్లరీకే ప్రజలు అధికార పగ్గాలు కట్టబెడతారు. ట్రంప్ ఇప్పుడైనా మారతాడో లేదో చూద్దాం..