కాంగ్రెస్ పాప ప్రక్షాళనకు అవకాశం దక్కుతుందా..!
posted on Jul 20, 2016 @ 12:26PM
ఏపీ ప్రత్యేక హోదా పై పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీనిపై 22వ తేదీన ఓటింగ్ జరగనుంది. దీంతో కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగి బిల్లును ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశ్యంతో.. వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే కేవీపీ ఢిల్లీ చేరుకోగా.. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా హస్తినకు చేరుకున్నారు. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కూడా తనదైన శైలిలో మంత్రాంగం నడుపుతున్నారు.
మరోవైపు అసలు ఈ బిల్లును చర్చకే రానివ్వం అంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీపై పట్టు సాధిస్తుందా. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు.. బీజేపీ పార్టీ వ్యూహాల ముందు నెగ్గుతాయా అన్నది ప్రశ్న. కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి తాము చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ గా భావిస్తుంది. ఎలాగైనా బిల్లుకు ఆమోదం లభించేలా చేసి.. ఏపీలో పార్టీ మెలైజీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.