పయ్యావుల ఇంత అసంతృప్తా..!

  తెలంగాణలో టీడీపీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకపక్క అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి వలసల పర్వం సాగుతుంది. ఇప్పటికే టీడీపీ నేతలు చాలా మందే టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అంతేకాదు టీడీపీ నేతలు కూడా చాలా రోజుల నుండి పార్టీ కేడర్ పై  అసంతృప్తిగా ఉన్నారు. అందులో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశవ్ మాత్రం ఇంకా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలే వింటుంటే అలానే అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల తిరుపతి  కార్పోరేషన్ బాధ్యతలను కేశవ్‌కు అప్ప‌గించారు. దీంతో కేశ‌వ్ త‌ర‌చుగా తిరుప‌తికి వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యారు.  పార్టీ పదేళ్లు కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డామని, తీరా అధికారంలోకి వస్తే అనుభవించేందుకు ఇతరులు తయారయ్యారని , ఏం చేద్దాం..మన తలరాతే అట్లా ఉందంటూ వ్యాఖ్యానించినట్లు స‌మాచారం. ఇలాంటి చిన్నా చిత‌కా ప‌నులు మేం చేయాల‌ని.. బుగ్గ‌కారులో తిరిగేందుకు మాత్రం ఇప్పుడొచ్చిన వారికి అవ‌కాశం ఇస్తారు అంటూ ఆయ‌న త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కార‌ట‌.   ఇదిలా ఉండగా త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుంది. దీంతో పయ్యావుల మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పదవికి కూడా పోటు పడింది. ఆ సీటు కూడా వేరే వారికి రిజర్వేషన్ అయింది అని తెలిసి నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు అనుకుంటున్నారు. మరి దీనిపై పార్టీ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.

పాకిస్థాన్ లో పేలుళ్లు.. 55 మంది మృతి..

  పాకిస్థాన్ లో మరోసారి పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 55 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మంది గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం.. పాకిస్థాన్ లోని సివిల్‌ ఆస్పత్రిలో పేలుళ్లు సంభవించాయి. బలూచిస్థాన్‌ బార్‌ అసోసియేషన్స్‌ ప్రెసిడెంట్‌ బిలాల్‌ను కాల్చి చంపిన తర్వాత ఆస్పత్రిలో పేలుళ్లు సంభవించాయి. ఆస్పత్రిలో బిలాల్‌ మృతదేహం ఉంచిన ఎమర్జెన్సీ వార్డు వద్ద లాయర్లు, జర్నలిస్టులు గుమిగూడి ఉన్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో 55 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 100 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని.. బలూచిస్థాన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి అన్వరుల్‌ హక్‌ తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  

ఒబామా కూతురి పార్ట్ టైం జాబ్... ఆరుగురు సీక్రెట్ ఏజెంట్లు..

ఆమె చేసేదే పార్ట్ టైం జామ్. కానీ ఆమెకు ఆరుగురు సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు కాపలా. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఎవరా అమ్మాయి.. ఆమెకు సీక్రెట్ ఏజెంట్లు ఎందుకు అంటారా..? ఇంతకీ సంగతేంటంటే.. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న బరాక్ ఒబామా చిన్న కూతురు సాషా మసాచుసెట్స్ లోని ఓ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెస్టారెంట్ యూనిఫాం అయిన టీ షర్ట్, టోపీ పెట్టుకొని ఆమె సాధారణ అమ్మాయిలా అక్కడ పనిచేస్తున్న తీరుకు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఆమె సర్వ్ చేసే ఫుడ్ కోసం కస్టమర్లు కూడా ఎక్కువయ్యారట. ఇక ఎంతైనా ఆమె సామన్యమైన మనిషి కాదు.. ఒబామా కూతురు.. అందుకే ఆమెకు ఆరుగురు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను నియమించారు. కాగా జనవరి 20న అమెరికా అధ్యక్ష బాధ్యతల నుంచి బరాక్ వైదొలగనున్న సంగతి తెలిసిందే. తమ పిల్లలు సాధారణ జీవనానికి అలవాటు పడేందుకు ఇలా జాబ్ చేయడం తప్పు కాదని మిషెల్ ఒబామా అభిప్రాయపడ్డారు.

గ్యాంగ్‌స్టర్ నయూమ్ హతం.. పలు అనుమానాలు..?ఎక్స్ క్లూజివ్ ఫొటోస్..

  హైదరాబాద్ లోని షాద్ నగర్లో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే చనిపోయింది ఉగ్రవాది కాదు అని గ్యాంగ్ స్టర్ నయీమ్ అని పోలీసులు చెప్పారు. అసలు ఎవరీ నయీమ్... గ్యాంగ్ స్టర్ నయీమ్ నల్గొండ జిల్లా భువనగిరి వాసి. తన చిన్న వయసులోనే హైదరాబాద్ కు వచ్చేశాడు. 18 ఏళ్ళ వయసు నుండి పాతబస్తీలోని యాకత్ పురాలో ఉంటూ కారు మెకానిక్ గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలోనే తాను పలు నేరాలకు పాల్పడుతూ పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారాడు. ఎన్నో నేరాలు.. ఎన్నో హత్యలు చేసిన నయీమ్ పై 132 పోలీసు కేసులున్నాయి. అయితే ఇప్పటివరకూ అతను పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నాడు. గతంలో 11 సార్లు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న చరిత్ర నయీమ్ ది.   మొదటి సారి నయీమ్ పేరు ఓ మావోయిస్ట్ కార్యకర్త బెల్లి లలిత హత్య కేసుతో బయటకు వచ్చింది. ఆ తరువాత జనవరి 27, 1993లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ ను హత్య చేసి, పోలీసుల ఎదుట లొంగిపోయి సంచలనం సృష్టించాడు. ఆ తరువాత ఆరోగ్యం బాలేదని చెప్పి ఆస్పత్రిలో చేరి అక్కడ నుండి కూడా తప్పించుకున్నాడు. ఇలా పలుమార్లు తప్పించుకుంటూ.. దేశంలోని పలుచోట్ల తిరుగుతూ పోలీసులకు పెద్ద సవాల్ గా మారాడు. ఇప్పుడు షాద్ నగర్ కు రాగా పోలీసులు అతనిని హతమార్చారు. అయితే ఇన్నిరోజులకు నయీమ్ షాద్ నగర్ ఎందుకు వచ్చాడా అని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.       అనుమానాలు.. ఇదిలా ఉండగా ఇప్పుడు నయీం ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముందు నక్సలైట్ గా మారి.. ఆతరువాత పోలీసులకి ఇన్ ఫార్మర్ గా కూడా పనిచేశాడు. ప్రముఖ మావోస్టు నేతలను, మావోస్టు సానుబూతి పరులను హత్యచేసి పోలీసుల కంటే నక్సల్స్‌కే మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. అయితే ఇప్పుడు ఇది రాజకీయవర్గాల్లో కూడా పెద్ద చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే పలువురు నేతలను నయీం బెదిరించినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. నల్గొండజిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే అయిన జగదీశ్వర్ రెడ్డికి నయీం నుండి బెదిరింపులు ఎదురైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా పలువురు నేతలకు కూడా నయీం నుండి బెదిరింపులు ఎదురైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నయీం ఎన్ కౌంటర్ జరిగింది. ఒకప్పుడు పోలీసులకి ఇన్ ఫార్మర్ గా ఉన్న అతన్నే ఇప్పుడు ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని పులువురు సందేహ పడుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ కి రాజకీయాలకి ఏదైనా సంబంధం ఉందా అంటూ అనుమానిస్తున్నారు. మరి అసలు నిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

52 ఏళ్ల తరువాత... ఒలింపిక్స్ లో భారత్ రికార్డ్..

  రియో ఒలింపిక్స్ లో గత కొన్నేళ్లుగా నెరవేరని కలను భారత్ సొంతం చేసుకుంది. దాదాపు 52 ఏళ్లుగా ఈ విభాగానికి సంబంధించి మన దేశం ఒక అథ్లెట్ ను కూడా ఒలింపిక్స్ కు పంపించలేకపోయింది. అయితే ఇప్పుడు దీపా కర్మాకర్‌ కొత్త రికార్డ్ సృష్టించింది. రియో ఒలిపింక్స్ లో జిమ్నాస్టిక్ విభాగంలో దీపా పోటీ చేయడమే కాదు.. ‘ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌’ క్వాలిఫికేషన్‌లో సత్తా చాటి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్ కు చేరుకుంది. పోటీల్లో భాగంగా జరిగిన విభాగాల్లో మొదట 15.100తో దూసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచినా.. రెండో ప్రయత్నంలో 14.600తో అభిమానుల్ని కాస్త కంగారు పెట్టింది. అయితే చివరికి ఎనిమిదో స్థానంలో నిలిచి ఆగస్టు 14న జరగనున్న ఫైనల్‌ల్లో పతక వేటకు సిద్ధమైంది.   కాగా కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా అరుదైన రికార్డు సృష్టించిన దీపా కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలు గెలిస్తే.. అందులో 67 పసిడి పతకాలు ఉండటం విశేషం. మరి ఈ ఒలింపిక్స్ లో కూడా దీపా రికార్డ్ సృష్టింస్తుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.    

10 కోట్ల ఖర్చుకు ఆవు కథ చెప్పి వెళ్లిపోయారు..

  ప్రధాని నరేంద్ర మోడీ తాను అధికారం చేపట్టిన తరువాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి వచ్చిన ఆయన ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని... అనంతరం పార్టీ సమావేశంలో పాల్గొని.. ఆతరువాత ఢిల్లీకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు మోడీ పర్యటనపై కాంగ్రెస్ నేతలు ఎద్దేవ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనవల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని.. ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఇవ్వకుండా తెలంగాణ ప్రజలకు నిరాశ మిగిల్చారని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీకి ఘనస్వాగతం పలికి.. రూ. 10 కోట్లకు పైగా ఖర్చు పెట్టి బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఒక్క పథకం కూడా ఇవ్వకుండా.. ఆవు కథ చెప్పి వెళ్లిపోయారని విమర్శించారు. మిషన్ భగీరథ లాంటి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కూడా కల్పించలేదు. కేవలం మోడీని కేసీఆర్.. కేసీఆర్ ను మోడీ పొగడటానికి ఉన్నట్టు ఉంది అని అన్నారు.

షాద్ నగర్ లో కాల్పుల కలకలం.. గ్యాంగ్ స్టర్ మృతి..

  ఇప్పటివరకూ దేశంలో పలుచోట్ల ఉగ్రదాడులు జరిపి అందరిని వణికిస్తున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. గతకొద్దిరోజుల క్రితమే ఎన్ఐఏ అధికారులు పలువురు ఉగ్రవాద అనుమానితులను పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లోని మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ పట్టణంలోని భాషా అనే వ్యక్తి భవంతిలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని..భవంతిని చుట్టుముట్టారు. ఇంతలో భవంతి నుండి కాల్పులు రావడంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులు ప్రారంభించారు. మరోవైపు పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. కాగా ఎంత మంది ఉగ్రవాదులు ఆ ఇంట్లో నక్కి ఉన్నారన్న విషయమై సమాచారం లేనప్పటికీ, గ్యాంగ్ స్టర్ నయూమ్ అనే ఉగ్రవాది హతమైనట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

మయన్మార్‌లో అంతుచిక్కని వ్యాధి.. 38 మంది మృతి

మయన్మార్‌లో ఓ అంతుచిక్కని వ్యాధి చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంటోంది. మయన్మార్ వాయువ్య ప్రాంతమైన సగైంగ్‌లోని లాహెల్ టౌన్‌షిప్‌లో ఈ వ్యాధి ప్రబలింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలతో చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లాహెల్ టౌన్‌షిప్‌లో 38 మందికి ఈ వ్యాధి సోకగా..వారిలో 28 మంది మరణించారు. అయితే వీరిలో ముగ్గురికి మాత్రం తట్టు సోకినట్లు నిర్థారణ కాగా..మిగతా వారికి ఏ వ్యాధి సోకిందో మాత్రం అంతుచిక్కడం లేదు. మరో టౌన్‌షిప్‌ నాన్యున్‌లోనూ ఇదే తరహా లక్షణాలతో 13 మంది చిన్నారులు మరణించారు. రక్త నమూనాలను య్యూగన్‌లోని నేషనల్ హెల్త్ లేబరేటరీలో పరిశీలిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులంతా ఎక్కువగా 12 ఏళ్లలోపు వారే.

తెలంగాణకు అండగా ఉంటా-మోడీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తలపెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో అత్యంత పిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ. ఏ కారణాల వల్ల తెలంగాణ ఏర్పడిందో ఆ కలలను సాకారం చేసుకుంటుందని నమ్మకముంది. నన్ను కలిసినప్పుడల్లా సీఎం తెలంగాణ అభివృద్ధి కోసమే మాట్లాడేవారు. గుజరాత్‌లో ప్రతి ఇంటికి మంచినీరు ఎలా అందించారో కేసీఆర్ అధ్యయనం చేసి, అలాగే తెలంగాణలో కూడా ప్రతీ ఇంటికి మంచినీరిస్తామని సీఎం చెప్పారు.   ప్రతి ఒక్కరికి నీళ్లు ఇస్తే మట్టిలో నుంచి బంగారం పండించగల శక్తి ప్రజలకుందన్నారు. రెండేళ్లలో కరెంట్ సమస్య లేకుండా చేస్తామని అన్నారు. తెలంగాణ ఒకప్పుడు రూ.11 యూనిట్ చొప్పున కరెంట్ కొనేది. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు రూపాయి పది పైసలకే విద్యుత్‌ను కొంటున్నారు. కొత్తపల్లి రైల్వేలైను ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం. అభివృద్ధి కోసం కనెక్టివీటి అత్యవసరం, అందుకే కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేసినట్లు ప్రధాని తెలిపారు.

తొలి అంకం పూర్తయ్యింది..

కృష్ణా, గోదావరి జలాలను ప్రతీ ఇంటికి చేర్చాలన్న ప్రయత్నంలో..తొలి అంకం పూర్తయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ శుభదినమని చెప్పారు. ఒకే రోజు మిషన్ భగీరథ కార్యక్రమం, 1200 మెగావాట్ల జైపూర్ ధర్మల్ పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశామని, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన శిలాఫలకాలను ప్రధాని ఆవిష్కరించరన్నారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తర తెలంగాణ ప్రజల స్వప్నమైన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేయడం శుభపరిణామని పేర్కొన్నారు. దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న మోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. తెలంగాణ చేపట్టే ప్రతి పనిలో మోడీ ప్రేమ, సహకారం కావాలి. మీ తోడ్పాటుతో జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటామని స్పష్టం చేశారు.

హిందీలో ప్రసంగించిన సీఎం కేసీఆర్

దేశంలోని రాజకీయ నాయకుల్లో గొప్ప వక్తల్లో ఒకరిగా పేరుపొందారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మాట్లాడుతుంటే జనం మైమరచిపోతారు..సామెతలతో జోష్ నింపాలన్నా..తుటాల్లాంటి మాటలతో ఊగిపోయేలా చేయాలన్నా ఆయనకే చెల్లింది. ప్రతి ఇంటికీ తాగునీరు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తొలి యూనిట్‌ను ప్రధాని నరేంద్రమోడీ మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో తొలుత కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రసంగించగా..అనంతరం కేసీఆర్ ప్రసంగించడానికి లేచారు. ఆయన ప్రసంగం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న జనం చప్పట్లతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. అయితే ఆయన తెలుగులో ప్రసంగించడానికి బదులు హిందీలో ప్రసంగించారు. దీంతో జనం నిరాశకు లోనయ్యారు.