పయ్యావుల ఇంత అసంతృప్తా..!
posted on Aug 8, 2016 @ 4:35PM
తెలంగాణలో టీడీపీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకపక్క అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి వలసల పర్వం సాగుతుంది. ఇప్పటికే టీడీపీ నేతలు చాలా మందే టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అంతేకాదు టీడీపీ నేతలు కూడా చాలా రోజుల నుండి పార్టీ కేడర్ పై అసంతృప్తిగా ఉన్నారు. అందులో టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ మాత్రం ఇంకా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలే వింటుంటే అలానే అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సీఎం చంద్రబాబు ఇటీవల తిరుపతి కార్పోరేషన్ బాధ్యతలను కేశవ్‌కు అప్పగించారు. దీంతో కేశవ్ తరచుగా తిరుపతికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. పార్టీ పదేళ్లు కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడ్డామని, తీరా అధికారంలోకి వస్తే అనుభవించేందుకు ఇతరులు తయారయ్యారని , ఏం చేద్దాం..మన తలరాతే అట్లా ఉందంటూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇలాంటి చిన్నా చితకా పనులు మేం చేయాలని.. బుగ్గకారులో తిరిగేందుకు మాత్రం ఇప్పుడొచ్చిన వారికి అవకాశం ఇస్తారు అంటూ ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారట.
ఇదిలా ఉండగా త్వరలో కేబినెట్ విస్తరణ జరగనుంది. దీంతో పయ్యావుల మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ పదవికి కూడా పోటు పడింది. ఆ సీటు కూడా వేరే వారికి రిజర్వేషన్ అయింది అని తెలిసి నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు అనుకుంటున్నారు. మరి దీనిపై పార్టీ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.