తెలంగాణకు అండగా ఉంటా-మోడీ
posted on Aug 7, 2016 @ 5:42PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తలపెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. భారతదేశంలో అత్యంత పిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ. ఏ కారణాల వల్ల తెలంగాణ ఏర్పడిందో ఆ కలలను సాకారం చేసుకుంటుందని నమ్మకముంది. నన్ను కలిసినప్పుడల్లా సీఎం తెలంగాణ అభివృద్ధి కోసమే మాట్లాడేవారు. గుజరాత్‌లో ప్రతి ఇంటికి మంచినీరు ఎలా అందించారో కేసీఆర్ అధ్యయనం చేసి, అలాగే తెలంగాణలో కూడా ప్రతీ ఇంటికి మంచినీరిస్తామని సీఎం చెప్పారు.
ప్రతి ఒక్కరికి నీళ్లు ఇస్తే మట్టిలో నుంచి బంగారం పండించగల శక్తి ప్రజలకుందన్నారు. రెండేళ్లలో కరెంట్ సమస్య లేకుండా చేస్తామని అన్నారు. తెలంగాణ ఒకప్పుడు రూ.11 యూనిట్ చొప్పున కరెంట్ కొనేది. కానీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ సంస్కరణల ఫలితంగా ఇప్పుడు రూపాయి పది పైసలకే విద్యుత్‌ను కొంటున్నారు. కొత్తపల్లి రైల్వేలైను ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం. అభివృద్ధి కోసం కనెక్టివీటి అత్యవసరం, అందుకే కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేసినట్లు ప్రధాని తెలిపారు.