తొలి అంకం పూర్తయ్యింది..
posted on Aug 7, 2016 @ 4:48PM
కృష్ణా, గోదావరి జలాలను ప్రతీ ఇంటికి చేర్చాలన్న ప్రయత్నంలో..తొలి అంకం పూర్తయిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ రోజు తెలంగాణ ప్రజలందరికీ శుభదినమని చెప్పారు. ఒకే రోజు మిషన్ భగీరథ కార్యక్రమం, 1200 మెగావాట్ల జైపూర్ ధర్మల్ పవర్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశామని, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ శంకుస్థాపన శిలాఫలకాలను ప్రధాని ఆవిష్కరించరన్నారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తర తెలంగాణ ప్రజల స్వప్నమైన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేయడం శుభపరిణామని పేర్కొన్నారు. దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న మోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. తెలంగాణ చేపట్టే ప్రతి పనిలో మోడీ ప్రేమ, సహకారం కావాలి. మీ తోడ్పాటుతో జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటామని స్పష్టం చేశారు.