రేపే కృష్ణ పుష్కరాలు.. చంద్రబాబు ఆదేశాలు..
రేపటి నుండి కృష్ణ పుష్కరాలు జరగనున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లు అన్ని చేసింది. కృష్ణ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారు. కృష్ణ పుష్కరాల ఏర్పాట్లపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా పుష్కర విధులకు అధికారులంతా విధిగా హాజరుకావాలని చెప్పారు. ప్రజల సంతృప్తే ప్రజాప్రతినిధులు ప్రతిష్ఠగా భావించాలని, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విధులు సమర్థంగా నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. అలాగే ఐవీఆర్‌ఎస్, మీడియాలో వచ్చే సమాచారంపై వెంటనే స్పందించాలని, ఎక్కడా విధి నిర్వహణ లోపం ఉండకూడదని అన్నారు. అలాగే టీటీడీ భోజన ఏర్పాట్ల ట్రయల్ రన్ నిర్వహించాలని, రద్దీ కూడళ్ల దగ్గర ట్రాఫిక్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, రవాణా, తాగునీరు, భోజనం, లైటింగ్, శానిటేషన్‌పై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.