అందులో ఉండలేం.. పని చేయలేం... ఏపీ మంత్రులు
ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా శాఖలు అమరావతికి తరలివచ్చాయి. ఇక హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులు కూడా చాలామంది ఏపీకి చేరుకున్నారు. అయితే వెళ్లడానికి వెళ్లారు కానీ.. అక్కడ సరైన వసతులు లేని కారణంగా కొంత మంది ఉద్యోగులు మళ్లీ తిరిగివచ్చేశారు. ఇక ఇప్పుడు మంత్రుల వంతు వచ్చింది. తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాల తరలింపునకు నేడు చివరి ముహూర్తం కాగా ఈరోజు యనమల రామకృష్ణుడు ఆర్ధిక శాఖ కార్యాలయాన్ని కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. అయితే మిగిలిన మంత్రులు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, గంటా శ్రీనివాస్, ప్రత్తిపాటి, కొల్లు రవీంద్రలు మాత్రం తమ గదులు చిన్నవిగా ఉన్నాయని, అందులో ఉండలేమని, అక్కడి నుంచి పనిచేయలేమని స్పష్టం చేశారు. వాటిని వెంటనే కూల్చి మరింత వెడల్పుగా నిర్మించాలని సూచించారు.. దీనికి స్పందించిన మునిసిపల్ మంత్రి పి.నారాయణ.. మంత్రుల ఫిర్యాదులు, అభిప్రాయాలు తీసుకున్నామని, ప్రస్తుతం ఐదు చాంబర్లుగా ఉన్న ప్రాంతాన్ని మూడు చాంబర్లుగా మారుస్తామని చెప్పారు. కాని దీనికి కాస్త సమయం పడుతుందని తెలిపారు. మరి దీనికి చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.