52 ఏళ్ల తరువాత... ఒలింపిక్స్ లో భారత్ రికార్డ్..
posted on Aug 8, 2016 @ 11:48AM
రియో ఒలింపిక్స్ లో గత కొన్నేళ్లుగా నెరవేరని కలను భారత్ సొంతం చేసుకుంది. దాదాపు 52 ఏళ్లుగా ఈ విభాగానికి సంబంధించి మన దేశం ఒక అథ్లెట్ ను కూడా ఒలింపిక్స్ కు పంపించలేకపోయింది. అయితే ఇప్పుడు దీపా కర్మాకర్ కొత్త రికార్డ్ సృష్టించింది. రియో ఒలిపింక్స్ లో జిమ్నాస్టిక్ విభాగంలో దీపా పోటీ చేయడమే కాదు.. ‘ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్’ క్వాలిఫికేషన్‌లో సత్తా చాటి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్ కు చేరుకుంది. పోటీల్లో భాగంగా జరిగిన విభాగాల్లో మొదట 15.100తో దూసుకెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచినా.. రెండో ప్రయత్నంలో 14.600తో అభిమానుల్ని కాస్త కంగారు పెట్టింది. అయితే చివరికి ఎనిమిదో స్థానంలో నిలిచి ఆగస్టు 14న జరగనున్న ఫైనల్‌ల్లో పతక వేటకు సిద్ధమైంది.
కాగా కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా అరుదైన రికార్డు సృష్టించిన దీపా కెరీర్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలు గెలిస్తే.. అందులో 67 పసిడి పతకాలు ఉండటం విశేషం. మరి ఈ ఒలింపిక్స్ లో కూడా దీపా రికార్డ్ సృష్టింస్తుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.