సుజనా ఇది సరైన పద్ధతి కాదు.. చంద్రబాబు

  ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో ఒకపక్క ఏపీ ఎంపీలందరూ కలిసి ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈవిషయంలో టీడీపీ నేత సుజనా చౌదరి రాజ్యసభలో వ్యవహరించిన తీరుకు విమర్శలు తలెత్తుతున్నాయి. పార్లమెంట్లో నిన్న కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరుగిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు చర్చ సందర్భంగా సభలో పెద్ద గందరగోళం నెలకొంది. ఇక కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ బిల్లు పై మాట్లాడుతూ.. ఇది ద్రవ్య బిల్లు అని చెప్పారు. అయితే దీనికి మిత్రపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆఖరికి ఈ విషయంలో స్పీకర్ కురియన్ స్పందించి.. ప్రైవేటు బిల్లును ఆర్థిక బిల్లా కాదా అన్న అంశం లోక్ సభ స్పీకర్ తేలుస్తారని.. రాజ్యసభ స్పీకర్ కు ఆ అవకాశం లేదని చెప్పారు. కురియన్ అలా ప్రకటించగానే బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇక్కడే సుజనా చౌదరి పప్పులో కాలేశారు. బీజేపీ నేతలతో కలిసి ఆయన కూడా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. అంతే దీంతో ఇప్పుడు ఇది పెద్ద దుమారమైంది.   ఇక దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. రాజ్యసభలో సుజనాచౌదరి చప్పట్లు కొట్టడం సరైన చర్య కాదని అన్నారు.

ఏపీకి హోదా వచ్చినట్టే.. మోడీ నవ్వులో అంత అర్ధం ఉందా..!

  ఏపీకి ప్రత్యేక హోద వచ్చేసినట్టేనటా.. అందుకు కారణం మోడీ నవ్వడమేనట.. ఇంతకీ ఈవిషయం ఎవరు చెప్పారబ్బా అనుకుంటున్నారా.. ఇంకెవరూ స్వయంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయు. ఏపీ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలందరూ పార్లమెంట్లో నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.   ఇదిలా ఉండగా నిన్న టీడీపీ ఎంపీల బృందం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అక్కడ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మంత్ర పఠనం చేశారు. దీంతో మోడీ పగలబడి నవ్వారు. అయితే మోడీ నవ్వుపై స్పందించిన వెంకయ్యనాయుడు టీడీపీ నేతలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. మోదీ అంతగా పగలబడి నవ్వారంటే మీ పని అయిపోయినట్లేనని అని అన్నారట. అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లేనని కూడా ఆయన చెప్పారట. దీంతో ఇప్పుడు అందరూ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు. వెంకయ్యనాయుడు ఏదో సరదాగా అన్నారా..లేక సీరియస్ గానే అన్నారా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   మరోవైపు ఎలాగూ శివప్రసాద్ అప్పుడప్పుడు విచిత్రమైన వేషాలు వేసుకుంటూ తన నిరసనను తెలుపుతుంటారు. ఆ వేషాలు చూస్తే మామూలుగానే అందరికి నవ్వొస్తుంటుంది. మరి మోడీకి కూడా శివప్రసాద్ ను చూసి నవ్వు వచ్చివుంటదని పలువురు అనుకుంటున్నారు. మరి మోడీ ఎందుకు నవ్వారో తెలియదు కానీ.. వెంకయ్య నాయుడు చెప్పిన వ్యాఖ్యలు వింటే మాత్రం ఏపీ ప్రజలకు కాస్త ఊరట లభించినట్టయింది. చూద్దాం మరి మోడీ నవ్వులో ఏం అర్ధం దాగుందో..

బీజేపీ మంత్రిగారు ఏం చెప్పారు..

ఒక పక్క ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అటు పార్లమెంట్ లోనూ.. ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులందరూ రాజకీయాలకతీతంగా ఒక్కటై పార్లమెంట్లో తమ వాదనలు వినిపించారు. ఇక రాష్ట్రంలో వైసీపీ పార్టీ చేపట్టిన బంద్ కు పార్టీలన్నీ మద్దతు తెలిపి బంద్ లో పాల్గొన్నాయి. ఇలా అందరూ ఏపీకి ప్రత్యేక హోదా రావాలని డిమాండ్ చేస్తుంటే.. బీజేపీ నేత మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరం లేదని.. ప్రత్యేకహోదా అనేది వరకట్నం లాంటిదని, దానిని 14వ ఆర్థిక సంఘం కట్ చేసిందని అందువల్లే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఏపీని స్పెషల్ స్టేటస్ గా కాకుండా స్పెషల్ స్టేట్ గా మోదీ సర్కార్ గుర్తించిందని, అందుకే అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఏపీకి హోదా, రాజధాని నిర్మాణం విషయంలో దేశంలో ఇప్పటివరకు విభజించిన ఏ రాష్ర్టానికి కేంద్రం ఇవ్వలేదని, స్వయంగా ఎదిగాయని గుర్తు చేశారు. మొత్తానికి బేజీపీ నేతలు మొదటి నుండి చెబుతున్న మాటలను.. మంత్రిగారు మరోసారి రిపీట్ చేశారు. ఇప్పటికే ఏపీ ప్రజలకు బీజేపీపై నమ్మకం పోయింది. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలతో అది ఇంకాస్త బలపడినట్టైంది.

మంత్రి నారాయణ రికార్డ్.. దేశంలోనే ధనిక మంత్రి

అప్పుడెప్పుడో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల పనితీరును బట్టి ర్యాంకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు మంత్రి నారాయణకు చివరి స్థానం వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఓ విషయంలో నారాయణ మొదటి స్థానం సంపాదించారు. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు.. దేశ వ్యాప్తంగా సాధించి రికార్డ్ బద్దలు కొట్టారు. ఇంతకీ ఏ విషయంలో నారాయణ ప్రథమస్థానంలో నిలిచారబ్బా అనుకుంటున్నారా.. అదేంటంటే.. దేశంలోని అత్యంత ధనవంతులైన మంత్రుల జాబితాలో పి.నారాయణ ప్రథమస్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు.  ఢిల్లీకి చెందిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మంత్రుల ఆదాయంపై సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం..  నారాయణ మొత్తం ఆస్తి విలువ రూ.496 కోట్లుగా తేలింది. దీంతో ఆయన దేశంలోనే ధనిక మంత్రిగా ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ రూ.251 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఏపీకి చెందిన మరో 20 మంది మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

కోలుకుంటున్న సోనియాగాంధీ..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి నాలుగు రోజుల క్రితం భుజానికి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స జరిగింది. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్టు తెలుస్తోంది. నాలుగురోజులపాటూ ఐసీయూలోనే చికిత్స పొందిన ఆమెను శుక్రవారం ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చారు.ఆవిడ పరిస్థితి చాలా మెరుగైనట్టు గంగారాం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.   కాగా వారణాసిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయారు. దానివల్ల భుజానికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. డీహైడ్రైషన్ సమస్యతో కూడా ఆమె బాధపడ్డారు.

బ్లాక్ మనీ టు రియల్ ఎస్టేట్

  ఏ మార్గంలో డబ్బు సంపాదించాం అన్నది ముఖ్యం కాదు.. ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. అలా తప్పుడు మార్గాలు ఎన్నుకునే చాలామంది చిక్కుల్లో పడుతున్నారు. మన ప్రభుత్వాలకి కట్టాల్సిన డబ్బులు ఎగ్గొట్టి... ఏవో తప్పుడు లెక్కలు చూపెడుతూ.. ఆ డబ్బును కాస్త విదేశాల్లో దాచిపెట్టి.. కోట్లకి కోట్లు రూపాయలు మూటగట్టుకుంటారు. కొన్ని లక్షల కోట్ల బ్లాక్ మనీ విదేశాల్లో మూలుగుతుందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆ డబ్బును ఏం చేస్తారో వింటే కాస్త ఆశ్చర్యపోవాల్సిందే. కొంతమంది బ్లాక్ మనీని  పొలిటికల్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటారు. మరి కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. అలాంటి మార్గాల్లోనిదే ఈ ఎంసెట్ స్కామ్. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్-2 లీకేజ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం వెలుగు చూసిన ఈ స్కాం పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కొన్ని కోట్ల రూపాయలతో చేసిన ఈ స్కాంలో ప్రధాన నిందితుడు అయిన రాజగోపాల్ రెడ్డిని అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఎంసెట్-2 లీకేడ్ స్కాంకు ఢిల్లీలోని ఇక్బాల్ అనే వ్యక్తి కీలకపాత్ర పోషించినట్టు సీఐడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి కలెక్ట్ చేసిన కోట్ల రూపాయలతో రాజగోపాల్ రెడ్డి అమరావతిలో ఫ్లాట్స్ కొన్నట్టు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల నుండి భారీ మొత్తంలో సొమ్ము జమ చేసిన గోపాల్ రెడ్డి అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్టు అధికారులు తెలుపుతున్నారు. అమరావతిలోనే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా భూములు కొనడానికి ప్లాన్ చేశాడట. అయితే దీనికి రాష్ట్ర విభజన జరిగి అక్కడి భూములకు బాగా డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం కావచ్చు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత భూముల మండి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు కొని పెట్టుకుంటే భవిష్యత్తులో మంచి రేటుకు అమ్ముకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ముందు జాగ్రత్తగా అమరావతిలో ఫ్లాట్స్ కొనుక్కొని పెట్టుకున్నాడు.   మొత్తానికి అక్రమ మార్గంలో సంపాదించి కూడా ఎంచక్కా ఇంత దర్జాగా భూములు, ఫాట్స్ కొనుకుంటున్నారా. ఇంకా దౌర్భగ్యమైన పరిస్థితి ఏంటంటే..2007, 2013లోనూ క్వశ్చన్ పేపర్ లీకేజీ సూత్రధారుడు ఈయనే. 2014లో అవిభక్త ఏపీలో పీడీ మెడికల్ ఎంట్రెన్స్ లీకు చేసి భారీగా సొమ్ముచేసుకున్న ఘనుడు గోపాల్ రెడ్డి. ఇలాంటి నేర చరిత్ర ఉన్న రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్నది అందరి సందేహం. మరి ప్రభుత్వాలే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అక్రమంగా ఎందుకు డబ్బు సంపాదించరు..! నేరం ఎవరు చేసినా… కోట్లలో డబ్బులు మారినా… లోపమంతా ప్రభుత్వ యంత్రాంగంలోనే ఉందికదా?

హోదా బిల్లు చర్చ పై రచ్చ.. పలువురు ఇలా..

  రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ సందర్బంగా సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా బిల్లు కచ్చితంగా మనీ బిల్లేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. మనీ బిల్లులపై రాజ్యసభలో చర్చ చేపట్టవచ్చుగానీ, ఎలాంటి ఓటింగులకూ ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఒక బిల్లు మనీ బిల్లు అవునా? కాదా? అన్న విషయమై అనుమానాలు తలెత్తితే, లోక్ సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ (స్పీకర్) నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని తెలిపారు. ద్రవ్య బిల్లులన్నీ తొలుత లోక్ సభలో మాత్రమే చర్చకు రావాలన్న రాజ్యాంగ నిబంధనలను జైట్లీ చదివి వినిపించారు. దీనికి కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించి.. హోదా ఇవ్వొద్దని 14 ఆర్ధిక సంఘం చెప్పలేదు.. ఈ విషయాన్ని నేను రుజువు చేస్తాను.. జైట్లీ కొన్ని అవాస్తవాలు చెప్పారు అని అన్నారు. దీనికి స్పీకర్ కురియన్ కల్పించుకొని అవాస్తవాలు చెబితే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వండి అని అన్నారు. ఇంకా కేవీపీ బిల్లుపై చర్చ ముగిసింది..ఓటింగ్ కు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి..కేవీపీ బిల్లు ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లుగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.. ఇది మనీ బిల్లాకాదా అని తేల్చేది లోక్ సభ.. లోక్ సభ స్పీకరే ఈ విషయాన్ని తేల్చాలి.. రాజ్యసభ ఛైర్మన్ కు అధికారం లేదు అని అన్నారు. దీనికి కపిల్ సిబాల్ స్పందిస్తూ లోక్ సభలో ప్రవేశపెట్టే ప్రతి చట్టంవల్ల కేంద్ర నిధులపై ప్రభావం చూపుతుంది.. కేవీపీ ప్రైవేటు బిల్లులో ఆర్ధిక అంశాలు లేవు.. అరుణ్ జైట్లీ చెప్పేది వింటే ప్రతి బిల్లు మనీ బిల్లుగానే మారుతుంది.. బిల్లును లోక్ సభకు పంపించండి.. మనీ బిల్లా కాదా స్పీకర్ నిర్ణయిస్తారు అని అన్నారు.

పాక్ పర్యటనపై రాజ్ నాథ్ సింగ్.. వారికి మంచి బుద్ధి ప్రసాదించి..

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సార్క్ సదస్సులో పాల్గొనడానికి పాకిస్థాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పాకిస్థాన్ పర్యటనకు తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి కూడా విదితమే. అంతేకాదు ఆయన అక్కడికి వెళ్లినప్పుడు కూడా ఉగ్రవాద అనుకూల సంస్థలు, కశ్మీర్ వేర్పాటువాద నేతలు రాజ్‌నాథ్‌ పాకిస్థాన్‌లో పర్యటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఈ విషయాన్నే ఆయన రాజ్యసభలో ప్రస్తావించారు.   సార్క్ సదస్సు వివరాల గురించి.. తనకు ఎదురైన వ్యతిరేకత గురించి వివరించారు. రాజ్‌నాథ్ మాట్లాడుతూ ‘చ‌ట్టాల‌ నుంచి ఉగ్ర‌వాదులు త‌ప్పించుకోకుండా చూడాల‌ని సార్క్ స‌దస్సులో కోరానని తెలిపారు. అంతేకాదు తీవ్ర‌వాదుల‌పై ప్ర‌పంచ దేశాల‌న్నీ స‌మ్మ‌తించిన ఆంక్ష‌ల‌ను అన్ని దేశాలు అమ‌లు ప‌ర‌చాల‌ని.. ఉగ్ర‌వాదులకు తోడ్ప‌డే దేశాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పానని చెప్పారు.   అయితే అసలు నిర‌స‌న‌ల‌కు పాల్ప‌డతారని తెలిస్తే పాక్‌కి వెళ్లేవాడిని కాదు. నేను హెలికాఫ్ట‌ర్‌లో హోట‌ల్ కి వెళ్లినప్పుడు కొంద‌రు వ్యక్తులు నాకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు చేశారు. దేవుడా, అంద‌రికీ మంచి బుద్ధిని ప్ర‌సాదించు’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఒక పక్క విషాదం.. మరోపక్క మంత్రిగారి సెల్ఫీ..

  కొంతమంది నేతలు తెలిసి చేస్తారో.. తెలియక చేస్తోరో..లేక తాము అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుతుందిలే అని అనుకుంటారో తెలియదుకానీ.. తప్పులు చేస్తుంటారు. చిక్కుల్లో పడతారో. ఇప్పుడు మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్‌ మెహతా కూడా అలాంటి చిక్కుల్లోనే పడ్డారు. వివరాల ప్రకారం.. ముంబయి-గోవా రహదారిపై మహద్‌ వద్ద బ్రిటిష్‌ కాలం నాటి పురాతన వంతెన సావిత్రి నది ఉద్ధృతికి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది గల్లంతవ్వగా , సహాయక సిబ్బంది ఇప్పటి వరకూ 14 మృతదేహాలను వెలికి తీశారు. దీంతో  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సందర్శించడానికి వచ్చారు. ఆయనతోపాటు ప్రకాశ్‌ మెహతా కూడా వచ్చారు. వచ్చిన ఆయన ఖాళీగా ఉండటం ఎందుకని అనుకున్నారేమో.. ఓ సెల్ఫీ తీసేసుకున్నారు. అంతే ఇక ఆయనపై ఒకటే విమర్శలు. ఒకపక్క అక్కడ అంత విషాదం నెలకొంటే.. మంత్రిగారు సెల్పీ తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇక ఈ విషయాన్ని ప్రశ్నించిన మీడియా వారిపై కూడా ఆయన దురుసుగా ప్రవర్తించి బుక్కయ్యారు. దీంతో మీడియా ప్రతినిధులు మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.   మరి ఇంతా తెలిసి ప్రతిపక్ష పార్టీలు ఊరుకునే ఉంటాయా.. ఆయన చేసిన పనికి తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆఖరికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మోడీని కలిసిన చంద్రబాబు.. హోదా అంశంపై చర్చ..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. త్వరలో జరగబోయే కృష్ణ పుష్కరాలకు రావాలని చంద్రబాబు మోడీని ఆహ్వానించారు. అంతేకాదు ఈరోజు రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై కూడా చంద్రబాబు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రావాల్సిన ఇతర నిధులు, జీఎస్టీ అంశాలపై చర్చించారు.   మరోవైపు లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ఎంపీలు లోక్‌సభలో పట్టుబట్టారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు సముదాయించినా ఎంపీలు వినిపించుకోలేదు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం పార్లమెంటు ఆవరణలోనూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ సభలో నినాదాలు చేశారు.

26/11 నిందితుడు అరెస్ట్..

  26/11 ఈరోజు అందరికి గుర్తుండే ఉంటుంది. 2008 వ సంవత్సరంలో 26/11 రోజున ముంబైలో ఉగ్రవాదులు జరిపి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో విదేశీయులు సహా 160 మంది మృతి చెందగా దాదాపు 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పుడు ఈ దాడుల కీలక నిందితుడుగా భావిస్తున్న సుఫియాన్ జాఫర్‌ను పాకిస్థాన్ భద్రతా దళాలు అరెస్ట్ చేశారు. అతనిని పోలీసులు యాంటీ టెర్రరిజం కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది. కాగా డైరెక్టర్ మజ్హర్ కాకాఖేల్ ఆధ్వర్యంలోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) బృందం నిందితుడిని ఇంటరాగేట్ చేయనుంది. మరి ఈ విచారణలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.

యూపీలో సేమ్ సీన్.. దళిత యువకుడు మృతి

ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో దళితులపై అరాచకాలు ఎక్కువవుతున్నాయన్న నేపథ్యంలో పార్లమెంట్ సభల్లో దుమారం రేగుతోంది. ఇప్పుడు దీనికి తోడు మరో ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగతనం కేసులో అరెస్ట్ చేసి తీసుకువచ్చిన దళిత వ్యక్తిని పోలీసులు చితక్కొట్టడంతో అతను మరిణించాడు. ఇప్పుడు ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. వివరాల ప్రకారం. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ పోలీసు స్టేషన్ లో పోలీసులు దొంగతనం కేసులో కమల్ వాల్మీకి అనే యువకుడిని అరెస్ట్ చేశారు. అయితే అతనిని పోలీసులు కొట్టడంతో లాకప్ లోనే మరణించాడు. దీంతో యువకుడి బంధువులు, దళిత సంఘాలు నిరసనలకు దిగాయి. పోలీసులే కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులకు విషయం తెలిసి ఆ స్టేషన్ లో పని చేస్తున్న మొత్తం 14 మంది సిబ్బందినీ సస్పెండ్ చేసింది. మరోవైపు దళిత వర్గం నేత మాయావతి దీనిపై స్పందించి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి యూపీలో గత కొన్ని రోజులుగా దళితులపై దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం..

కోతులకు కూడా కుటుంబ నియంత్రణ.. ఎక్కడ..?

  సాధారణంగా జనాభా పెరుగుతున్నందుకు కుటుంబనియంత్రణలు చేస్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు కోతులకు కూడా కుటుంబ నియంత్రణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆగ్రాలో కోతుల బెడద ఎక్కువైంది. గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. అదిలించిన వారిపై దాడికి దిగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8వేల కోతులు ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఆరేళ్లలో ఆగ్రాలో కోతుల సంఖ్య 2.16 లక్షలకు చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. అందుకే ముందు జాగ్రత్తగా వీటికి కుటుంబ నియంత్రణ చేపట్టాలని ఓ స్వచ్ఛంద సంస్థ భావించింది. దీనిలో భాగంగానే ఆగ్రా అధికారులు కలిసి కోతులకు ఫ్యామిలీ ప్లానింగ్ వ్యాక్సిన్‌లను ఇస్తున్నారు. గత మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆగష్టు చివరి నాటికి 500 కోతులకు వ్యాక్సినేషన్, స్టెరిలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు ఇప్పటి దాకా 317 కోతులకు ఈ ప్రక్రియ పూర్తి చేశారు.

కాన్పూర్‌లో లాకప్ డెత్..స్టేషన్ మొత్తం సస్పెండ్

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దొంగతనం కేసులో విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకొచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడమే ఉద్రిక్తతలకు కారణం. కమల్ వాల్మీకి అనే వ్యక్తిని ఇటీవల దొంగతనం కేసులో విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే వాల్మీకి లాకప్‌లో ఉరివేసుకుని మరణించాడని, మృతదేహన్ని తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే అతడిది ఆత్మహత్య కాదని..పోలీసులే కొట్టి చంపిఉంటారని కుటుంబస భ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అతని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు..ఘటన జరిగిన పీఎస్‌లోని మొత్తం 14 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదిక వస్తే కాని అసలు విషయం తెలియదు.

26/11 ముంబై దాడుల సూత్రధారి అరెస్ట్..

26/11 దాడులు ఈ రోజును ముంబై వాసులు ఎప్పటికీ మరచిపోలేరు. 2008లో కసబ్ తదితర ముష్కరులు ముంబై వీధుల్లో జరిపిన మారణకాండలో విదేశీయులు సహా 160 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సుఫియాన్ జాఫ‌ర్‌ సహా పలువురు తీవ్రవాదులను తమకు అప్పగించాల్సిందిగా పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ నేపథ్యంలో సుఫియాన్ జాఫర్‌ను పాక్ భద్రతా దళాలు అరెస్ట్ చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. అరెస్ట్ అనంతరం అతనిని యాంటీ టెర్రరిజం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 8 రోజుల రిమాండ్ విధించింది. మజ్హర్ కాకాఖేల్ ఆధ్వర్యంలోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జాఫర్‌ను విచారణ చేయనుంది.

హరీశ్ రావత్ అంత పని చేశాడా..?

  ఉత్తరాఖండ్ సీఎం మరో వివాదంలో చిక్కుకుపోయారు. గత కొన్ని రోజుల క్రితం ఓ మహిళ.. తాను ఓ విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళితే బీజేపీ నేత హరక్ సింగ్ తనపై లైంగిక దాడి చేశారని పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతే ఇక ఆయనపై కేసు నమోదు అవ్వడం.. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో ఆమె అందరికి ఓ ట్విస్ట్ ఇచ్చింది. ఉత్తరాఖండ్ సీఎం ఆదేశించినందువల్లే తాను అలా అబద్ధం చెప్పి, తప్పుడు కేసు పెట్టాల్సి వచ్చిందని.. తనను సీఎం తరుపు వారు బెదిరించి అలా చేయించారని చెప్పింది. దీంతో హరీశ్ రావత్ చిక్కుల్లో పడ్డారు. ఇక ఇది విన్న బీజేపీ నేతలు ఊరుకుంటారా.. హరీశ్ రావత్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా కుట్రలు చేసే వ్యక్తి సీఎంగా ఉండడానికి వీల్లేదని... వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు హరీశ్ రావత్ రివర్స్ లో బీజేపీ నేతలే బీజేపీ వాళ్లే మహిళను బెదిరించి అలా తనపై వ్యతిరేకంగా చెప్పిస్తున్నారని అన్నారు. మరి ఎవరు ఎవరిని బెదిరించారో తెలియాలంటే కొంచం వెయిట్ చేయాల్సిందే.