గ్యాంగ్‌స్టర్ నయూమ్ హతం.. పలు అనుమానాలు..?ఎక్స్ క్లూజివ్ ఫొటోస్..
posted on Aug 8, 2016 @ 12:34PM
హైదరాబాద్ లోని షాద్ నగర్లో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే చనిపోయింది ఉగ్రవాది కాదు అని గ్యాంగ్ స్టర్ నయీమ్ అని పోలీసులు చెప్పారు.
అసలు ఎవరీ నయీమ్...
గ్యాంగ్ స్టర్ నయీమ్ నల్గొండ జిల్లా భువనగిరి వాసి. తన చిన్న వయసులోనే హైదరాబాద్ కు వచ్చేశాడు. 18 ఏళ్ళ వయసు నుండి పాతబస్తీలోని యాకత్ పురాలో ఉంటూ కారు మెకానిక్ గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలోనే తాను పలు నేరాలకు పాల్పడుతూ పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారాడు. ఎన్నో నేరాలు.. ఎన్నో హత్యలు చేసిన నయీమ్ పై 132 పోలీసు కేసులున్నాయి. అయితే ఇప్పటివరకూ అతను పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నాడు. గతంలో 11 సార్లు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న చరిత్ర నయీమ్ ది.
మొదటి సారి నయీమ్ పేరు ఓ మావోయిస్ట్ కార్యకర్త బెల్లి లలిత హత్య కేసుతో బయటకు వచ్చింది. ఆ తరువాత జనవరి 27, 1993లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ ను హత్య చేసి, పోలీసుల ఎదుట లొంగిపోయి సంచలనం సృష్టించాడు. ఆ తరువాత ఆరోగ్యం బాలేదని చెప్పి ఆస్పత్రిలో చేరి అక్కడ నుండి కూడా తప్పించుకున్నాడు. ఇలా పలుమార్లు తప్పించుకుంటూ.. దేశంలోని పలుచోట్ల తిరుగుతూ పోలీసులకు పెద్ద సవాల్ గా మారాడు. ఇప్పుడు షాద్ నగర్ కు రాగా పోలీసులు అతనిని హతమార్చారు. అయితే ఇన్నిరోజులకు నయీమ్ షాద్ నగర్ ఎందుకు వచ్చాడా అని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాలు..
ఇదిలా ఉండగా ఇప్పుడు నయీం ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముందు నక్సలైట్ గా మారి.. ఆతరువాత పోలీసులకి ఇన్ ఫార్మర్ గా కూడా పనిచేశాడు. ప్రముఖ మావోస్టు నేతలను, మావోస్టు సానుబూతి పరులను హత్యచేసి పోలీసుల కంటే నక్సల్స్‌కే మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. అయితే ఇప్పుడు ఇది రాజకీయవర్గాల్లో కూడా పెద్ద చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే పలువురు నేతలను నయీం బెదిరించినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. నల్గొండజిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే అయిన జగదీశ్వర్ రెడ్డికి నయీం నుండి బెదిరింపులు ఎదురైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా పలువురు నేతలకు కూడా నయీం నుండి బెదిరింపులు ఎదురైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నయీం ఎన్ కౌంటర్ జరిగింది. ఒకప్పుడు పోలీసులకి ఇన్ ఫార్మర్ గా ఉన్న అతన్నే ఇప్పుడు ఎన్ కౌంటర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని పులువురు సందేహ పడుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ కి రాజకీయాలకి ఏదైనా సంబంధం ఉందా అంటూ అనుమానిస్తున్నారు. మరి అసలు నిజాలు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.