కాశ్మీర్ అల్లర్లపై మొదటిసారి నోరు విప్పిన మోడీ..
posted on Aug 9, 2016 @ 4:55PM
గత కొద్ది రోజులుగా కాశ్మీర్లో అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాది బుర్హాన్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో కాశ్మీర్ లోని గయలో అల్లర్లు మొదలయ్యాయి. ఇక ఈ అల్లర్ల నేపథ్యంలో పలువురు పలు రకాల వ్యాఖ్యలే చేశారు. అయితే ఇన్ని రోజుల నుండి అల్లర్లు జరుగుతున్నా ఇప్పటివరకూ నోరు విప్పని ప్రధాని ఇప్పుడు మొదటి సారి తన పెదవి విప్పారు. మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన కాశ్మీర్ అల్లర్లపై మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ యువతను కొంతమంది కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని.. పుస్తకాలు, ల్యాప్ టాప్‌లు, క్రికెట్ బ్యాట్లు పట్టాల్సిన వారి చేతులకు రాళ్లు ఇస్తూ వారిని కొందరు హింసకు పురిగొల్పుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కొంతమంది కారణంగా ఆ రాష్ట్రంలో అశాంతి నెలకొందని అన్నారు. కల్లోలం సృష్టించడానికి ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం వారి ప్రయత్నాలను తిప్పి కొడుతూ కశ్మీర్‌లో మామూలు పరిస్థితులు తీసుకురావడానికే ప్రయత్నిస్తోందని మోదీ పేర్కొన్నారు.