సొంత ఇంటికి నయీమ్ మృతదేహం..
posted on Aug 9, 2016 @ 2:46PM
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ను షాద్ నగర్లో పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతని మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి... అనంతరం అతడి డెడ్ బాడిని అతని కుటుంబసభ్యులకి అందజేశారు. నల్లగొండ జిల్లాలోని అతడి సొంతూరు నుంచి బంధువులు వచ్చి నయీమ్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని వారు పోలీసులను కోరారు. దీనికి పోలీసులు అంగీకరించడంతో నయీమ్ మేనకోడలు షాజిదాబేగం, బావ సలీం మరొకొందరు షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం నయీమ్ మృతదేహాన్ని భువనగిరికి తీసుకువెళ్లారు. భువనగిరిలోనే ఓ దర్గాలోని శ్మశానవాటికలో మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా ఇప్పటికే నయీమ్ అనుచరులు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇంకా అతని భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పిల్లల్ని కస్తూరిభా ఆశ్రమానికి తరలించారు. అంతేకాదు నయీమ్ హత్యానంతరం.. అతని ఇంటిలో సోదాలు నిర్వహించారు. హైదరాబాదులోని అలకాపురి ఇంటిలో సోదా చేసిన పోలీసులకు భారీ ఎత్తున నగదు, స్థిరాస్తులకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ.2.5 కోట్లకు పైగా.. 2 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ స్థిరాస్తుల పత్రాల విలువ రూ.2 వేల కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం.