నంది అవార్డుల స్థానంలో కొత్త పేరు..
posted on Aug 9, 2016 @ 3:43PM
రాష్ట్ర విభజన జరిగిన తరువాత రెండు రాష్ట్రాలు దాదాపు అన్ని శాఖలను పంచేసుకన్నాయి. ఏదో ఒకటి రెండు పెండింగ్ లో ఉన్నా.. దాదాపు రెండు రాష్ట్రాలు..రాష్ట్ర ప్రత్యేకతలను తాము చూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాల్లో తమ కంటూ ఓ ప్రత్యేకత ఉండాలని చూస్తుంది. తమ రాష్ట్ర జంతువు, పక్షి, చెట్టు, చేప అంటూ అన్నింటికి పేర్లు పెట్టేసుకుంది. ఇప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ విషయంలో కూడా తెలంగాణ సర్కార్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. నంది అవార్డుల విషయంలో.. నంది అవార్డుల స్థానంలో త్వరలోనే కొత్త పేరును ప్రకటిస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై అధికారులతో సచివాలయంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. చిన్న సినిమాలను ప్రోత్సహిస్తామని, అన్ని థియేటర్లలోనూ ఐదో ప్రదర్శనగా చిన్న సినిమాలకు అనుమతిస్తామని చెప్పిన తలసాని, 200 సీట్ల సామర్థ్యంతో మినీ థియేటర్లకు త్వరలోనే అనుమతిస్తామని తెలిపారు.