ఓడినా గెలిచింది..
posted on Aug 20, 2016 8:41AM
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తెలుగుతేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన తొలి భారత మహిళగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి, కరోలినా మారిన్‌తో తలపడిన సింధు..ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. పాయింట్ పాయింట్ నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో ఆమె 21-19, 12-21, 15-21 తేడాతో ఓటమి చవిచూసింది. అయితే స్వర్ణం సాధించేందుకు సింధు చెమటోడ్చింది. బలమైన ప్రత్యర్థి అని భయపడకుండా తొలి గేమ్ నుంచే ఎదురుదాడికి దిగింది. క్రాస్ కోర్టు షాట్లు, స్మాష్‌లు, నెట్‌గేమ్‌తో తొలిసెట్‌ను గెలిచింది. అనంతరం పుంజుకున్న మారిన్ సింధును ఒత్తిడిలోకి నెట్టి అంతలోనే ఆటను మార్చేసి పసిడిని ఖాతాలో వేసుకుంది. సింధు ఓడినా కాని తన పోరాటంతో క్రీడాభిమానులకు వినోదాన్ని అందించింది. అటు దేశం ఆమె ఆట చూడాలని స్క్రీన్లకు అతుక్కుపోయింది. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ కోసం ఎంత హడావుడి ఉంటుందో..అలా యావత్ భారతావని సింధు మ్యానియాతో ఊగిపోయింది.