ట్వీట్ల వల్ల తిట్లు తింటున్న కాంగ్రెస్..
posted on Aug 20, 2016 @ 5:36PM
ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సరిగా ట్వీట్స్ చేయడం కూడా రావడం లేదనిపిస్తోంది. ఆవేశంతో ట్వీట్స్ చేసి పలువురి ఆగ్రహానికి గురవుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ 'పాక్ ఆక్రమిత కాశ్మీర్' అని అభివర్ణించడానికి బదులు.. 'భారత్ ఆక్రమిత కాశ్మీర్' అని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఇంకేముంది దానిపై ఒకటే విమర్శలు.. పెద్ద దుమారమే రేగింది. ఇక ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ తప్పులో కాలేసింది. తాజాగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా వివాదాస్పద ట్వీట్ చేసింది. అదేంటంటే ఇందిరా గాందీ మరణానంతరం.. రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలు..
'ఓ మహావృక్షం కూలినప్పుడు నేల సహజంగానే అదురుతుంది' అంటూ రాజీవ్ అప్పట్లో పేర్కొన్నారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురవ్వగా.. ఆ వెంటనే పెద్ద ఎత్తున సిక్కులపై అలర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2,700 మంది సిక్కులు చనిపోయారు.
అయితే ఇప్పుడు రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా బెంగాల్ పీసీసీ ఈ వ్యాఖ్యలను ట్వీట్ చేసింది. ఇక దీంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిక్కులపై జరిగిన అమానుష గాయాలను మళ్లీ గుర్తుచేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యను పెట్టిందా? అంటూ వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలిసి చేసినా.. తెలియక చేసినా ప్రాబ్లమ్స్ మాత్రం కొనితెచ్చుకుంటున్నాయి..