16 ఏళ్ల తరువాత తల్లిని కలిసిన ఇరోం షర్మిల..
posted on Aug 20, 2016 @ 12:04PM
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం షర్మిల సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలు తొలగించాలని 16 ఏళ్లుగా దీక్ష చేసిన సంగతి తెలిసిందే. కానీ తాను చేసే దీక్షకు ప్రభుత్వాల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక తాను దీక్ష చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించి దీక్షను విరమించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆమె దీక్ష ప్రారంభించి 16 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటివరకూ ఆమె తన తల్లిని కలుసుకోలేదు. షర్మిలా దీక్ష చేపట్టిన రోజే ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేసే వరకు ఆహారం తీసుకోనని, ఇంటికి వెళ్లనని, తల్లిని కూడా కలవనని దీక్ష ఆరంభించారు. అలాగే ఇన్ని సంవత్సరాలు తన తల్లిని కలిసే ప్రయత్నం చేయలేదు. ఇక షర్మిలా తల్లి కూడా తన కూతురిని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు షర్మిలా తల్లి ఇరోం సాక్షి దేవి, ఆమె సోదరి ఆస్పత్రికి వచ్చి షర్మిలను కలిశారు. దీంతో షర్మిల చాలా ఆనందపడ్డారు. పదహారేళ్ల తర్వాత తన తల్లి, సోదరి తన కోసం రావడం చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉందని చెప్పారు. ఆర్మీ దళాల ప్రత్యేక హక్కుల చట్టంపై పోరాటం ఆపనని.. రాజకీయాల్లోకి వచ్చి ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.