డీఎంకే ఎమ్మెల్యేలు అందరిపై ఎఫ్ఐఆర్..
posted on Aug 21, 2016 @ 12:27PM
తమిళనాడులోకి డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరిపై పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాల ప్రకారం.. తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకే పార్టీకి చెందిన నేత డీఎంకే పార్టీ నేత, కరుణానిధి తనయుడు స్టాలిన్ ను విమర్శించిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరిని వారంరోజులపాటు సస్పెండ్ చేశారు. దీనిలో భాగంగానే డీఎంకే పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జయలలిత ప్రభుత్వాన్ని, అసెంబ్లీలో అన్నాడీఎంకే పార్టీ వైఖరిని విమర్శిస్తూ, భారీ ఎత్తున కార్యకర్తలతో సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు. అయితే ధర్నాకు అనుమతి లేదని.. ఎమ్మెల్యేలను అందరినీ అరెస్ట్ చేస్తున్నామని స్పష్టం చేసిన పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వెంటనే స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా స్టాలిన్ సహా 60 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఈ పరిస్థితుల్లో తమిళనాట అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు.