తెలుగువన్‌ చిత్రానికి అరుదైన గౌరవం

ఉగ్రవాదం నేపధ్యంలో తెలుగువన్‌ రూపొందించిన బాలల చిత్రం ‘అబ్దుల్‌’ మరో మైలురాయిని చేరుకుంది. నవంబర్‌ 8 నుంచి 14 వరకూ జైపూర్‌లో జరగనున్న జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి ఎంపికైంది. దేశవిదేశాల నుంచి ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శించే జైపూర్‌ చిత్రోత్సవంలో ఒక తెలుగు చిత్రం కూడా భాగం కావడం గర్వించదగ్గ విషయం. గత ఏడాది హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంతో ‘అబ్దుల్‌’ ప్రస్థానం మొదలైంది. అందులో ఏషియన్‌ పనోరమా విభాగంలో అనేక చిత్రాలతో పోటీపడి, విమర్శకుల అభినందలను పొందింది.   ఆపై పూనేలో జరిగిన లఘుచిత్రాల ప్రదర్శనలో జ్యూరీ ప్రత్యేక ప్రశంసలను సైతం సాధించింది. మనది కాదు అనుకునే ఉగ్రవాదం, రోజువారీ జీవితాల్లోకి ఎలా చొచ్చుకువస్తోందో ‘అబ్దుల్‌’ రచయిత, దర్శకుడు ఆనంద్‌ గుర్రం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఉగ్రవాదానికి కులమతాలు, పేదాగొప్పా, చిన్నాపెద్దా తారతమ్యాలు ఉండవని సున్నితంగా చాటిచెప్పిన ‘అబ్దుల్‌’ అప్పటి వార్తాపత్రికలలో పతాకశీర్షికగా నిలిచింది. తెలుగువాడి సృజనను, స్పందనను చాటిన అబ్దుల్ మరెన్ని విజయాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే!  

తృప్తి దేశాయ్ మరో విజయం.. తరువాత టార్గెట్ శబరిమల..

  భూమాత బ్రిగేడ్ సంస్థ అధినేత్రి తృప్తీ దేశాయ్ ఇప్పటివరకూ పలు ఆలయాల్లో ప్రవేశించి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో విజయం మూటగట్టుకున్నారు తృప్తీ దేశాయ్. ఇప్పటికే శనిసింగనాపూర్, నాసిక్ లోని త్రయంబకేశ్వరాలయంలోకి వెళ్లడానికి అనుమతి సంపాదించిన తృప్తీ దేశాయ్ ముంబైలోని హజీ అలీ దర్గాలోకి కూడా మహిళలను అనుమతించాలని ఉద్యమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు. ఇక దీనిపై విచారించిన కోర్టు దర్గాలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేస్తున్న‌ట్లు తీర్పు వెల్లడించింది. దర్గాలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించడం వారి ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్లేనని.. పురుషులతో సమానంగా మహిళలు కూడా దర్గాలోనికి వెళ్లొచ్చని, ఈ క్రమంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో భూమాత బ్రిగేడ్ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు తదుపరి లక్ష్యం శబరిమల అంటూ తృప్తీ దేశాయ్ తెలిపారు. మరోవైపు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హజీ అలీ దర్గా ట్రస్ట్‌ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు అమలును ఆరు వారాల పాటు నిలుపుదల చేశారు.

తెలంగాణ కొత్త జిల్లాల చిత్రపటం..

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్త జిల్లాలకు సంబంధించిన కసరత్తులో ఉందన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోప్రస్తుతం 10 జిల్లాలు ఉండగా.. ఇప్పుడు అదనంగా మరో 17 జిల్లాలు ఏర్పాటు చేయడానికి సర్కార్ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశాలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ రాష్ట్రలకు సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దీని ద్వారా ప్రజల నుండి ఫిర్యాదులు సేకరిస్తారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కొత్తజిల్లాల చిత్రపటాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ ఈఆర్‌ఏసీ సహాయంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ వీటిని రూపొందించారు. మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. 27 జిల్లాలతో కూడిన రాష్ట్ర పటంతో పాటు 27 జిల్లాల పటాలను ఏర్పాటు చేశారు.

రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ....

  సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రేపు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ప్రతినిధి రాఘవయ్య మాట్లాడుతూ.. రేపు సాయంత్రం నాలుగు గంటలకు జనసేన పార్టీ బహిరంగ సభ జరుగుతుందని.. ఇందిరా మైదానంలో పవన్ బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారని.. బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని.. సభ ప్రశాంతంగా జరగాలని ఎస్పీ జయలక్ష్మీ కోరారని తెలిపారు. కాగా 2008 ఆగ‌స్టు 26న ప‌వ‌న్ అన్న‌య్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని తిరుపతిలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. స‌రిగ్గా ఎనిమిది సంవత్స‌రాల త‌రువాత ఈరోజు జ‌న‌సేన స‌భ అంశంపై ప్ర‌క‌ట‌న రావ‌డాన్ని అభిమానులు గొప్ప‌ విశేషంగా అభివ‌ర్ణిస్తున్నారు.

అమ్మకు షాక్.. శశికళకు ఊరట..

  ఈ మధ్య అమ్మ సర్కార్ కు సుప్రీంకోర్టులో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితమే పరువు నష్టం కేసులో అమ్మకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయగా ఇప్పుడు మరోసారి సుప్రీం చేతిలో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే నేత ఎంపీ శశికళను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆమెపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. తన ఇంటిలో పనిచేసే పనిమనుషులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. శశికళ పుష్ప దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్ పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మద్రాస్ హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ కు అప్పగిస్తూ.. పుష్ప కుటుంబ సభ్యుల అరెస్ట్ పై ఆరు వారాల పాటు స్టే విదించింది.

సింధుని గుజరాత్‌లో సత్కరిస్తాం..

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధును సన్మానించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రప్రభుత్వాలు, సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి గుజరాత్ ప్రభుత్వం చేరింది. సింధుని తమ రాష్ట్రానికి పిలిపించి ఘనంగా సత్కరిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తెలిపారు. హైదరాబాద్ హైటెక్‌సిటీలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింధు ఒలింపిక్స్‌లో అద్భుతంగా ఆడిందని, అలాంటి ఆమెను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా మోడీ పాలనకు ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని..త్వరలో జరిగ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజన్‌పై మళ్లీ స్వామి నిప్పులు..

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కోపం ఇంకా తగ్గినట్లులేదు. తాజాగా ఆయన మరోసారి రాజన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజన్‌కు కనీసం ఎకనామిక్స్‌లో డిగ్రీ కూడా లేదని ఆరోపించారు. ఇవాళ ప్రముఖ వార్తాసంస్థతో మాట్లాడిన స్వామి..ఆర్బీఐ గవర్నర్‌గా ఎంపికైన ఉర్జిత్ పటేల్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌‌డీ చేశారు. యాలే వర్శిటీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. అయితే రాజన్‌కు ఎకనామిక్స్‌లో కనీస డిగ్రీ కూడా లేదన్నారు. ఇంజనీరింగ్ తర్వాత నేరుగా మేనేజ్‌మెంట్ స్టడీస్ చేసిన రాజన్..ఎకనామిక్స్‌లో కనీస విద్యార్హత కూడా సాధించలేదని ఆరోపించారు. 

టర్కీలో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 9మంది పోలీసులు మృతి..

వరుస ఉగ్రవాదుల దాడులతో టర్కీ వణికిపోతుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయి బీభత్సం సృష్టించారు ఉగ్రవాదులు. వివరాల ప్రకారం.. టర్కీలోని సిర్నక్ ప్రాంతంలోసిజర్‌ నగర పోలీసు ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో భారీ పేలుడుకు పాల్ప‌డ్డారు. ఈ పేలుడులో తొమ్మిదిమంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 64 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయ పడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడు వలన పోలీసు కార్యాల‌య బిల్డింగ్ పూర్తిగా ధ్వంస‌మైంది. అయితే ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించలేదు. కానీ కుర్దిష్ ఉగ్ర‌వాదులే ఈ దాడి చేసిన‌ట్లు అనుమానిస్తున్నారు.

రాజన్ పై మళ్లీ స్వామి కామెంట్స్...డిగ్రీ కూడా లేదు

  బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామికి ఆర్బీఐ గవర్నర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గత కొద్ది కాలంగా ఆయన రాజన్ పై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆ తరువాత పెద్దల ఆదేశం మేరుకు సైలెంట్ గా ఉన్నా..మళ్లీ ఇప్పుడు మొదటికి వచ్చారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ‘ఏఎన్ఐ’తో మాట్లాడిన ఆయన మరోసారి రాజన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్బీఐ గవర్నర్ గా ఎంపికైన ఉర్జిత్ పటేల్ ఎకనామిక్స్ లో పీహెచ్ డీ చేశారు. యాలే వర్సిటీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు. అయితే రాజన్ కు ఎకనామిక్స్ లో కనీస డిగ్రీ కూడా లేదు. ఇంజినీరింగ్ తర్వాత నేరుగా మేనేజ్ మెంట్ విద్యనభ్యసించిన రాజన్... ఎకనామిక్స్ లో కనీస విద్యార్హత కూడా సాధించలేదు’’ అని స్వామి ఆరోపించారు. మరి ఈ వ్యాఖ్యలకు రాజన్ స్పందిస్తారో లేదో చూడాలి.

ఐదు పైసలకే కిలో ఉల్లిపాయలు..

నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చుని ప్రజలకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లిపాయలు..తాజాగా వాటిని పండించిన రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోతుండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. నాసిక్‌కు చెందిన సుధాకర్ అనే రైతు తను పండించిన 13 క్వింటాళ్ల ఉల్లిపాయలను విక్రయించేందుకు సాయిఖేద వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చాడు. అయితే సుధాకర్ తెచ్చిన ఉల్లిపాయలు నాణ్యత బాగా లేదనే సాకుతో వ్యాపారులు క్వింటాల్ ఉల్లికి రూ.5గా ధర నిర్ణయించి, 13 క్వింటాళ్లకు రూ.65లు ఇస్తామన్నారు.   దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుధాకర్ తన పంటను తిరిగి తీసుకెళ్లిపోయాడు. వ్యాపారులు, మార్కెట్ అధికారుల వైఖరికి నిరసనగా కిలో ఉల్లిపాయలను ఐదు పైసలకే విక్రయించాడు. మార్కెట్‌లో 35 రోజుల సమ్మె వల్ల ఉల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో సుధాకర్ లాంటి రైతులు లబోదిబోమంటున్నారు. సాగుకి పెట్టిన పెట్టుబడికి అధికారులు ఇస్తున్న ధరకు ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో చాలా మంది రైతులు ఉల్లిపాయలను రోడ్లపై పారబోస్తున్నారు.

జైలులో పాము..వణికిపోయిన ఖైదీలు

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ జైలులో పాము కలకలం సృష్టించింది. రోహిణి జైలు ఆవరణలో పాము కనిపించడంతో ఖైదీలు ఆందోళన చెందారు. జైలు గార్డులు, సెక్యూరిటీ సిబ్బంది దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి అది చిక్కలేదు. దీంతో పాములను పట్టుకునే వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు సమాచారం అందించారు. ఆ సంస్థ ప్రతినిధులు వచ్చి పామును పట్టుకుని తీసుకువెళ్లారు. నీటి కుంటలు, డ్రైనేజీల వద్ద ఇలాంటి పాములు సంచరిస్తుంటాయని, ఈ పాము కరిస్తే విషపూరితమని సదరు ఎన్జీవో ప్రతినిధులు తెలిపారు. ఎట్టకేలకు పాము చిక్కడంతో ఖైదీలు, జైలు సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు.

నయీం కంటే నట్టికుమార్ బాధితులే ఎక్కువ

గ్యాంగ్‌‌స్టర్ నయీం వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నయీంతో సంబంధాలున్నాయంటూ నిర్మాత నట్టికుమార్ ప్రస్తావించిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే మీడియా సాక్షిగా వివరణ ఇవ్వగా..తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో నిర్మాత సి.కళ్యాణ్ చేరారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సి.కళ్యాణ్ తెర ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా నట్టికుమార్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పుడంతా నయీం బాధితులని అంటున్నారు గానీ, నట్టికుమార్ బాధితుల కోసం అని ఒక సెల్ తెరిస్తే, ఒక నెంబర్ ఇస్తే..నయీం బాధితుల కంటే ఎక్కువ మంది వస్తారని చెప్పారు. కుమార్ జీవితమంతా బ్లాక్‌మెయిల్, నీలిచిత్రాలమయమని ఆరోపించారు. తన సినిమాల్లో నటించే అమ్మాయిలను నగ్న చిత్రాలతో బ్లాక్‌మెయిల్ చేస్తారన్నారు. సినీ పరిశ్రమలో చాలామంది నట్టికుమార్ బాధితులు ఉన్నారని, ఎవరూ కూడా పోనీలే అని మీడియా ముందుకు రావడం లేదన్నారు. అతని గురించి త్వరలో మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి..

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మహాత్మాగాంధీ హత్య విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతితెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. అంతేకాదు దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌ కోర్టును కూడా ఆశ్రయించింది. దీనిపై రాహుల్‌ బుధవారం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. మహత్మాగాంధీని హత్య చేసిన సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ను తానెప్పుడూ నిందించలేదని, ఆ సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తి గాంధీ హత్యకు బాధ్యుడని మాత్రమే చెప్పానని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థకు చెందిన ప్రముఖ నేత ఎంజీ వైద్య అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుగా ఒప్పుకొని, క్షమాపణ చెప్పాలని  ‘ఆర్‌ఎస్‌ఎస్‌ మొత్తాన్ని తాను నిందించలేదని, సంస్థకు అనుబంధం ఓ వ్యక్తి బాధ్యుడని ఇప్పుడు రాహుల్‌ చెప్తున్నారు.. అయితే ఆ వ్యక్తికి ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలా సంబంధం ఉంది, సంస్థలో ఎలాంటి బాధ్యతలు చేపడుతున్నాడో రాహుల్‌ స్పష్టత ఇవ్వాలని అన్నారు. మరి రాహుల్ గాంధీ క్షమాపణ చెబుతారో లేదో చూడాలి.