తెలంగాణ కొత్త జిల్లాల్లోకి మరో మూడు జిల్లాలు...
posted on Oct 3, 2016 @ 12:39PM
తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు తోడుగా మరో 17 జిల్లాలు ఏర్పాటు చేసి మొత్తం 27 జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై అక్కడక్కడ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తమ ప్రాంతాన్ని కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆందోళనలు కూడా చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అయితే గద్వాల్ ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తన పదవికి రాజీనామా కూడా చేశారు. ఈనేపథ్యంలో 17 జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలు వచ్చి చేరనున్నట్టు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోని జనగామలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ మూడింటిని జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ చాలారోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై పలువురు నేతలతో చర్చించనున్నారు. ఇదివరకు ప్రకటించిన 17 జిల్లాలకు ఈ మూడు కలిపి మొత్తంగా 20 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.