ఎమ్మెల్యే పదవికి డీకే అరుణ రాజీనామా..
posted on Oct 1, 2016 @ 3:25PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గద్వాల్ ను కూడా ఆమె జిల్లాగ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆమె గత కొద్దికాలంగా పోరాటం చేస్తున్నారు కూడా. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... తన రాజీనామా లేఖను చదివి వినిపించారు. గద్వాలను జిల్లాగా చేయాలని ఏడాదిగా పలుమార్లు సీఎంకు వినతి పత్రాలు ఇచ్చామని..జిల్లా కోసం శాంతియుత ఉద్యమాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు జరిగాయని, ప్రజల ఆకాంక్షను సీఎంకు అనేక రూపాల్లో తెలిపామని వివరించారు. ప్రజల అభ్యంతరాలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు కానీ.. చివరకు వాటిని పట్టించుకోలేదని అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.