జయలలిత ఆరోగ్యంపై ఆందోళన... చికిత్స కోసం లండన్ డాక్టర్
posted on Oct 1, 2016 @ 1:20PM
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చైన్నె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు మెరుగైన చికిత్స అందించడానికి విదేశీ వైద్యులు కొద్దిసేపటి క్రితం చెన్నైకి చేరుకున్నారు. లండన్‌కు చెందిన కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్ డా.రిచర్డ్ జాన్ బేలే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రిచర్డ్ పర్యవేక్షణలోనే ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగుతాయని వైద్యులు తెలిపారు.
మరోవైపు జయలలిత ఆరోగ్యంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే వదంతులు సృష్టిస్తున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి జయలలిత ఆరోగ్యం గురించి హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అపోలో ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శిస్తారు. అమ్మ అభిమానులు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.