మోడీని పొగిడేసిన కేజ్రీవాల్... సెల్యూట్ చేస్తున్నా..
posted on Oct 3, 2016 @ 5:52PM
భారత్ సైన్యం పాక్ పై సర్జికల్ దాడులు చేసిన నేపథ్యంలో ఎప్పుడూ మోడీపై, ఆయన ప్రభుత్వం పై విరుచుకు పడే నేతలు కూడా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ దాడుల నేపథ్యంలో ఆయనను ప్రశంసించిన సంగతి తెలిసిందే. మోడీ రెండున్నరేళ్ల పాలనలో చేసిన మంచి పని ఇదే అని.. ఆయనను కలిసి ఆయనతో మాట్లాడాలని ఉందని అన్న సంగతి విదితమే. ఇప్పుడు ఈ జాబితాలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చేరిపోయారు. తాము పలు విషయాల్లో ప్రధానితో విభేదించినా.. పీవోకేలో సర‍్జికల్ స్ట్రయిక్స్ విషయంలో మోదీ చూపిన మనోబలానికి సెల్యూట్ చేస్తున్నట్లు కేజ్రీ పేర్కొన్నారు. భారత సైన్యం తీసుకున్న చర్యను తాము పూర్తిగా సమర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. మన సైనికులు దాడులకు దిగిన తరువాత పాక్ ఆర్మీ ఆ అంశంపై చేస్తున్న అసత్యప్రచారాన్ని భారత్ ఎండగట్టాలని మోదీకి తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ మీడియాలు పాకిస్థాన్ చెప్తున్న దానికి మద్దతిస్తూ కథనాలు ప్రచురిస్తున్నాయని, వాటిని చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందంటూ కేజ్రీవాల్ వెల్లడించారు.