మరోసారి బీసీసీఐపై లోథా కమిటీ ఆగ్రహం.. సిరీస్ రద్దు చేయాల్సిన అవసరం లేదు
posted on Oct 4, 2016 @ 10:58AM
లోథా కమిటీ మరోసారి బీసీసీఐకి షాకిచ్చింది. గతంలోనే బీసీసీఐ కమిటీ ఆదేశాలను పాటించడం లేదని తెలిపిన నేపథ్యంలో సుప్రీం చేత మొట్టికాయలు తిన్న బీసీసీఐ మరోసారి లోథా కమిటీకి బుక్కయింది. తమ సూచనలు పాటించకుండా మెంబర్ క్రికెట్ అసోసియేషన్లకు నిధులను మంజూరు చేయాలని నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. నిధులను కేటాయిస్తూ సెప్టెంబర్ 30న జరిగిన అత్యవసర సమావేశంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుందని, ఇది కమిటీ సూచనల ప్రకారం విరుద్దమని లోథా కమిటీ ఆరోపించింది. ఈనేపథ్యంలోనే బీసీసీఐ నిధుల పందేరాన్ని ఆపాలంటూ బ్యాంకులకు లేఖ రాసింది. ఒకవేళ అలా పాటించకపోతే ఈ విషయంపై మరోసారి సుప్రీం కోర్టును వెళతామని హెచ్చరించింది లోథా కమిటీ. ఇదిలా ఉండగా దీనివల్ల భారత్-న్యూడిలాండ్ మధ్య జరిగిన సిరీస్ కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
అయితే దీనిపై స్పందించిన జస్టిస్ లోథా న్యూజిలాండ్‌తో సిరీస్ రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. రోజువారీ వ్యవహారాలకు నిధులు వెచ్చింకూడదని బీసీసీఐకి చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వకూడదని మాత్రమే తాము చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా టీమిండియా-న్యూజిలాండ్ టీమ్‌ల మధ్య మరో టెస్టు మ్యాచ్, ఐదు వన్డే మ్యాచులు జరగాల్సి ఉంది.