బీఎండబ్ల్యూ కారు వెనక్కి ఇచ్చేస్తున్న దీపా కర్మాకర్... స్థోమత లేకనే...
posted on Oct 12, 2016 @ 3:25PM
రియో ఒలింపిక్స్ లో తన ప్రతిభను కనపర్చి.. దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన పీవీ సింధూ, సాక్షిమాలిక్, దీపా కర్మాకర్ లకు ప్రభుత్వాలు నజరానాలు అందజేసిన సంగతి తెలిసిందే. వాటితో పాటు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా వారికి ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు కూడా బహుకరించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడు తనకు ఇచ్చిన కారును వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. దీనికి కారణం.. ఈ ఖరీదైన కారును మెయింటెన్ చేయలేకపోవడమే. దీపా కర్మాకర్ ది పేద కుటుంబం కావడంతో దానిని భరించడం తనకు తలకుమించిన బరువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అగర్తలా వంటి చిన్న నగరంలో అంతటి ఖరీదైన, విలాసవంతమైన కారును ఉపయోగించడం దీప, ఆమె కుటుంబానికి కష్టంగా మారడం.. అగర్తలాలో ఇరుకురోడ్లు గుంతలు, గోతులతో అస్తవ్యస్తంగా ఉండటం వారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని సమాచారం. అందుకే ఈ కారును ఇచ్చిన చాముండేశ్వరినాథ్‌కు తిరిగి ఇచ్చేయనున్నారు. కాగా వచ్చేనెలలో జర్మనీలో జరగబోయే చాలెంజర్స్ కప్ కోసం దీప సన్నద్ధమవుతోంది.