న్యూస్ పేపర్లు చదువుతున్న జయలలిత..
posted on Oct 13, 2016 @ 2:51PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత కొద్ది రోజులుగా చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఆమె ఆరోగ్యం గురించి కాస్త గోప్యంగా ఉంచినా.. ఇప్పుడిప్పుడే హెల్త్ బులిటెన్ లు విడుదల చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఆమెకు వెంటిలేటర్ తీసేశామని.. పరిస్థితి కాస్త చక్కబడిందని చెప్పిన ఆపోలో వైద్య సిబ్బంది ఇప్పుడు మరింత సమాచారం అందిస్తున్నారు. మునుపటి కంటే ఇప్పుడు జయలలిత పరిస్థితి మెరుగ్గా ఉందని... ఆమె వార్తా పత్రికలు చదువుతున్నారని.. ఆమె త్వరగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారని అన్నాడీఎంకే ప్రతినిధి సీఆర్ సరస్వతి తెలిపారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి మాత్రం కాస్త సమయం పడుతుందని సరస్వతి తెలిపారు. కాగా ఇప్పటికే జయకు సంబంధించిన పలు బాధ్యతలను పన్నీర్ సెల్వంకు బదలాయించారు. పన్నీర్ సెల్వమ్‌కు పోర్ట్‌ఫోలియోలు ఇస్తున్న విషయాన్ని జయకు చెప్పినట్లు.. దానికి జయ కూడా ఓకే చెప్పినట్లు ఆమె స్పష్టం చేశారు. ఇన్‌ఫెక్షన్ ఉండడం వల్ల చికిత్స పొందుతున్న జయ గదిలోకి ఎవరూ వెల్లడం లేదని, కేవలం డాక్టర్లు మాత్రం ఆ రూమ్‌లోకి ప్రవేశిస్తున్నారని, సీఎం జయ అనుమతి లేకుండా అన్నాడీఎంకే పార్టీలో ఏమీ జరగదని సరస్వతి పేర్కొన్నారు.