ట్రంప్ అయినా.. హిల్లరీ అయినా.. మోడీని కలవాల్సిందే...
posted on Oct 13, 2016 @ 5:31PM
త్వరలోనే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న బరాక్ ఒబామా పదవికాలం పూర్తవనున్న సంగతి తెలిసిందే. ఇక నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు పదవి చేపట్టక తప్పదు. అయితే అసలు విషయం ఏంటంటే.. అధ్యక్ష పదవి ఎవరు చేపట్టినా.. భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవాల్సిందేనని అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ స్పష్టంచేసింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే సంస్థ చేసిన సర్వే వెల్లడించింది. కొత్తగా ఎన్నికై శ్వేతసౌధంలోకి వెళ్లేదెవరైనా భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందని.. కొత్తగా ఎన్నికయ్యే వారు భారత్-అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని పేర్కొంది. కీలక ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. కొత్త ప్రభుత్వం ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌లతో కలిసి పనిచేయాలని, పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అందరికీ ఆసక్తికర అంశాలపై దృష్టి పెట్టాలని వెల్లడించింది.