ట్రంప్ విజయం... సిద్దాంతి గెలుస్తాడా?.. ప్రొఫెసర్ గెలుస్తాడా..?
posted on Oct 13, 2016 @ 10:15AM
అమెరికా అధ్యక్షబరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కు రోజు రోజుకు వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలు రేసులో హిల్లరీ ముందంజలో ఉండగా.. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అయింది ట్రంప్ పరిస్థితి. నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఈసారి హిల్లరీ క్లింటన్ దే అని శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ అంచనా వేశారు. రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ కు జాతక ప్రకారం ఇప్పుడు ఏలిననాటి శని నడుస్తోందని, మిగతా గ్రహాల గమనం సైతం విజయాన్ని సూచించడం లేదని ఆయన తెలిపారు. జ్యేష్టా నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశిలో ట్రంప్ జన్మించారని, ఆయన జన్మలగ్నం సింహమని తెలిపారు. ఇంకా హిల్లరీది పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మించిన హిల్లరీది కుంభరాశి, జన్మలగ్నం తులా లగ్నమని.. ఆమె జాతకాన్ని పరిశీలిస్తే అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఖాయంగా తెలుస్తోందని వివరించారు. కాగా గతంలో ప్రొఫెసర్ అల్లాన్ లిచ్ మ్యాన్ ఈసారి విజయం ట్రంప్ దే అని చెప్పారు. గత ముప్పై ఏళ్లు పైనుండి ఈయన తనదైన సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఆయన చెప్పినట్టే ఫలితాలు వచ్చాయి. మరి ఈసారి జాతకం నిజం అవుతుందా.. ప్రొఫెసర్ జోస్యం నిజమవుతుందా తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.