తమిళనాట రైలు రోకో.. వెంటనే కావేరి నీరు విడుదల చేయండి..
posted on Oct 17, 2016 @ 11:11AM
కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి నీటి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమిళనాడుకు కావేరి నీటిని ఇప్పుడప్పుడే విడుదల చేసేది లేదని కర్ణాటక ప్రభుత్వం చెప్పినా.. దానికి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆఖరికి నీటిని విడుదల చేసింది. ఇప్పుడు మరోసారి ఈ నీటి వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడుకు కావేరి జలాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ డీఎంకే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైలురోకో చేపట్టింది. డీఎంకే విపక్ష నేత స్టాలిన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో పట్టాలపైకి చేరి రైళ్లను అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా వాటిని ధిక్కరిస్తున్న కర్ణాటక ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించిన స్టాలిన్, వెంటనే నీటిని విడుదల చేసి తమిళవాసుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. దాదాపు 200 వరకూ రైల్వే స్టేషన్లను డీఎంకే కార్యకర్తలు ముట్టడించినట్టు తెలుస్తోంది. 48 గంటల రైల్ రోకో తమిళనాడులో ప్రారంభం కావడంతో, ఈ ఉదయం పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా ఈ రైలు రోకోకి ప్రతిపక్షం డీఎంకేతో పాటు కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, డీఎండీకేలతో పాటు వర్తక, వాణిజ్య సంఘాలు మద్దతు ప్రకటించాయి.