ఎయిర్ ఇండియా విమానంకు తప్పిన ముప్పు...

ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. అలహాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం  టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తిందని పైలట్లు గమనించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం అందించగా.. అలహాబాద్ లోని ఎయిర్ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం క్షేమంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను వేరే విమానంలో పంపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్న ప్రయాణికులకు టికెట్ సొమ్మును రీఫండ్ చేశామని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ మిశ్రా తెలిపారు.

పాక్ గూఢాచారి అరెస్ట్...

  పాక్ సైన్యం భారత్ సైన్యంపై కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన ఓ గూఢాచారిని జ‌మ్మూక‌శ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి రెండు సిమ్ కార్డులు, మ్యాప్‌లను భ‌ద్ర‌తా ద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. పాక్‌కు స‌మాచారం చేర‌వేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అత‌న్ని భ‌ద్ర‌తా ద‌ళాలు విచారిస్తున్నాయి. మరోవైపు బారామల్లులో ఇద్దరు జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులను హతమార్చారు. క‌థువా జిల్లాలోని హీరాన‌గ‌ర్ సెక్టార్‌లో ఏడుగురు పాక్ రేంజ‌ర్లు హ‌త‌మైన నేప‌థ్యంలో అక్క‌డ ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది.

కొత్త పార్టీ యోచనలో అఖిలేష్ యాదవ్...

  యూపీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ములాయం కుటంబంలో ఉన్న కుటుంబ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే పలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఎస్పీ అధినేత ములాయం సింగ్ తనయుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ వస్తే ఎమ్మెల్యేలే సీఎంను ఎన్నుకుంటారని ములాయం ప్రకటించడం.. దానికి పార్టీ నేతల నుండి సైతం వ్యతిరేకత రావడం.. ఇక ఆతరువాత ములాయం మళ్లీ సీఎం అభ్యర్థిగా అఖిలేష్ యాదవే ఉంటాడని చెప్పడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీ నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని చూస్తున్న అఖిలేష్ యాదవ్..ములాయంకు లేఖ రాయడం జరిగింది. తాను ఓకే అంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని లేఖలో పేర్కోన్నారు. అయితే ఇప్పుడు ఎస్పీలో చీలిక తప్పదని.. త్వరలోనే ‘జాతీయ సమాజ్‌వాదీ పార్టీ’ లేదా ‘ప్రగతిశీల్ సమాజ్‌వాద్ పార్టీ’ పేరుతో కొత్త కుంపటి పెట్టేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగానే అంతా పూర్తి చేసి మోటార్ సైకిల్ గుర్తుతో ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి ఈ వార్తలపై ములాయం ఎలా స్పందిస్తారో చూద్దాం...

పట్టాలు తప్పిన రైలు..55 మంది మృతి

  రైలు పట్టాలు తప్పి జరిగిన ప్రమాదంలో దాదాపు 55 మంది మృతి చెందారు. ఈ ఘటన ఆఫ్రికా దేశం కమెరూన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాజ‌ధాని యోహోండ్ నుంచి పోర్ట్ న‌గ‌రం డౌలాకు వెళ్తోన్న ప్యాసింజ‌ర్ రైలు.. ఇస్కా ప‌ట్ట‌ణ స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ప్రమాదంలో 55 మంది మృతిచెందగా.. దాదాపు 575 మంది గాయ‌ప‌డినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని... రైలు బోగీల కింద చిక్కుకున్న వాళ్లను తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే కమెరూన్‌లో ఇటీవ‌ల భారీ వ‌ర్షాలు కురవడం వల్ల రోడ్ల‌ల‌న్నీ మూసుకుపోయాయి. ఆ కార‌ణంగా ట్రెయిన్లు అన్నీ భారీ జ‌నంతో కిక్కిరిసిపోతున్నాయి. అలాగే సాధారణంగా ఈ రైలు 600 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్లాల్సింది.. 1300 మంది ప్రయాణం చేస్తున్నారు.

బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఉగ్రవాది, పాక్ రేంజర్లు హతం..

భారత్ సరిహద్దుల్లో పాక్ సైన్యం తరచూ కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని  హీరా నగర్ సెక్టార్ పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవాన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు వారికి ధీటుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది సహా, ఏడుగురు పాక్ రేంజర్లను హతమార్చినట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూలో చొరబడాలన్నదే వారి ప్రధాన లక్ష్యమని, చొరబాటు యత్నాలను తాము తిప్పికొడుతున్నామని తెలిపారు.

స్టాలినే నా రాజకీయ వారసుడు....

డీఎంకే అధినేత కరుణానిధి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు. డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా, పార్టీ కోశాధికారిగా ఉన్న స్టాలినే తన రాజకీయ వారసుడని చెప్పారు. పార్టీ వ్యవహారాల్లో స్టాలిన్ సహాయపడుతున్నారని, ఇప్పటికే పార్టీకి సంబంధించి చాలా విషయాలు ఆయనే చూసుకుంటున్నారని.. పార్టీ కోసం జైలు శిక్ష అనుభవించడమే కాకుండా ఎన్నో విధాలుగా చిత్ర హింసలకు గురయ్యాడు. పార్టీలో ఈ స్థానాన్ని తన కష్టంతోనే సంపాదించుకున్నాడు. అందుకే తన రాజకీయ వారసుడయ్యాడు’ అని కరుణానిధి వ్యాఖ్యానించారు. అయితే తన మరో కుమారుడైన అళగిరిని తాను ఏమాత్రం దూరం చేసుకోనని.. పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు స్టాలిన్, అళగిరి ఇద్దరూ అవిశ్రాంతంగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. అయితే తాను రాజకీయాల నుంచి ఇంకా విరమించడం లేదని, పార్టీ నాయకత్వాన్ని స్టాలిక్‌కు అప్పగించబోనని అన్నారు.

జయలలిత హెల్త్.. మరో అప్ డేట్..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత నెలరోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ ఆరోగ్యం గురించి వైద్యులు రోజుకో ఆప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు పార్టీ వర్గాలు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చాలావరకు స్పృహలోనే ఉంటున్నారని.. ఆస్పత్రిలో బెడ్ మీద లేచి కూర్చుంటున్నారని తెలిపారు. అయితే శ్వాసకోశ సమస్యల కారణంగా ఆమెకు కృత్రిమ శ్వాస మాత్రం అందించాల్సి వస్తోందని.. ఆమెకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని, దానికి చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆమె మరన్నిరోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాల్సి ఉంటుందని, ఆ తర్వాత మాత్రమే ఊపిరి అందించే ట్యూబును ఉంచాలా తీసేయాలా అన్నది నిర్ణయించగలమని అన్నారు.

కేజ్రీవాల్ కు సుప్రీం చీవాట్లు...

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏ చిన్న విషయంలో కాస్త తేడా వచ్చినా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఈ విషయంలో గతంలోనే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు  అక్షింతలు పెట్టింది. ఇప్పుడు తాజాగా మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం సబబు కాదని.. సమస్యలపై ఇతరులను నిందించడం తగదని సూచించింది. ఢిల్లీలోని స్థానిక సంస్థలు తమ పనులను నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని చెప్పింది. అత్యంత ప్రధానమైన పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను అడ్డుకోవద్దని చెప్పింది.

లాలూ కొడుక్కి 44 వేల ప్రపొజల్స్ ...

  ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు  బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు ఈ మధ్య లవ్ ప్రపోజల్స్ వచ్చాయట. లవ్ ప్రపాజల్స్ అంటే ఏ ఒకటో రెండో అనుకుంటున్నారేమో... ఏకంగా 44 వేల ప్రపొజల్స్ వచ్చాయి. అసలు సంగతేంటంటే... ఎక్కడైనా రోడ్లు బాగాలేకపోతే ఈ నెంబర్ కు మెసేజ్ పంపండని తేజస్వి యాదవ్ ఓ నంబర్ ను ప్రకటించాడు. ఇంకేముంది అది కాస్త తన పర్సనల్ నంబర్ అనుకున్నారు అమ్మాయిలు. అక్కడితో ఆగకుండా 'నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్' అంటూ వాట్సాప్ చేసేశారు. అలా దాదాపు 44 వేల మంది అమ్మాయిలు 'నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్' అంటూ  తేజస్వికి ప్రపోజ్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తమ శరీర కొలతలు, రంగు, ఎత్తు, బరువు లాంటి పర్సనల్ విషయాలు కూడా మెసేజ్ లో తెలిపారట అమ్మాయిలు. ఇక దీని గురించి స్పందించిన  తేజస్వి యాదవ్ తాను ఇంకా బ్రహ్మచారినే కాబట్టి సరిపోయిందని... పెళ్లి అయి ఉంటే కష్టాల్లో పడేవాడినని.. పెద్దలు కుదిర్చిన పెళ్లినే తాను చేసుకుంటానని స్పష్టం చేశారు.

నేష‌న‌ల్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ రోహిత్ అరెస్ట్...

  నేష‌న‌ల్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ రోహిత్ భార్య లలిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో భాగంగా.. రోహిత్ చిల్లార్‌ను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఆత్మ‌హ‌త్య‌కు పురికొల్పాడ‌న్న ఆరోప‌ణ‌ల‌తో రోహిత్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈరోజు అతనిని కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. క‌ట్నం కోసం అత్త‌మామ‌లు వేధించ‌డం వ‌ల్లే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు ల‌లిత సూసైడ్ నోట్ లో తెలిపిన సంగతి తెలిసిందే. రెండు గంట‌ల ఆడియో టేపుల‌తోపాటు, ఓ సూసైడ్ లేఖ కూడా రాసి ల‌లిత ఆత్మ‌హ‌త్య చేసుకుంది.  ప్రొ క‌బ‌డ్డీ లీగ్‌లో బెంగ‌ళూరు బుల్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రోహిత్‌ను ఈ ఏడాది మార్చిలో రెండో పెళ్లి చేసుకుంది ల‌లిత‌.

బీసీసీఐ కి సుప్రీం మరో ఝలక్..వెంటనే ఆపేయండి..

బీసీసీఐ కి సుప్రీంకోర్టు మరోసారి ఝలక్ ఇచ్చింది. లోధా ప్యానెల్ సిఫార‌సుల‌పై త‌మ తీర్పును పునఃస‌మీక్షించాల్సిందిగా బీసీసీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని ధర్మాసనం కొట్టివేసింది. అది జరిగిన రెండు రోజులకే ఇప్పుడు మరో షాకిచ్చింది. బోర్డు, రాష్ట్ర సంఘాల మ‌ధ్య జ‌రుగుతున్న లావాదేవీ (మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ స‌హా)ల‌ను త‌క్ష‌ణం నిలిపేయాల్సిందిగా ఆదేశించింది. లోధా క‌మిటీ సంస్క‌ర‌ణ‌లు అమలు చేస్తామ‌ని రాష్ట్ర సంఘాలు అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తేనే వారికి నిధులు ఇవ్వాల‌ని స్ప‌ష్టంచేసింది. వీటిని ప‌రిశీలించ‌డానికి ఓ స్వ‌తంత్ర ఆడిట‌ర్‌ను నియ‌మించాల్సిందిగా లోధా క‌మిటీకి సూచించింది. కాగా ఇప్పటికే లోథా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి బీసీసీఐ గడువు అడిగిన సంగతి విదితమే.

లోకేశ్ కు చంద్రబాబు క్లాస్...

  చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు ప్రభుత్వ అధికారులకు క్లాసులు పీకుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తన తనయుడు నారా లోకేశ్ కు కూడా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. అది కూడా గుంటూరులోనే ఉండమనట. చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్ నుండి మకాం మార్చేశారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా ప్రభుత్వ అధికారులు సైతం ఇక్కడికే వచ్చి పాలన సాగిస్తున్నారు. అయితే లోకేశ్ మూడు రోజులు గుంటూరులో, నాలుగు రోజులు హైదరాబాద్ లో ఉంటున్నాడు. దీంతో ఇకపై గుంటూరులోనే ఉండాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. గుంటూరు కార్యాలయంలో ఎవరూ లేకుంటే, అక్కడికి వచ్చే వారంతా ఇబ్బంది పడతారని భావించి లోకేష్ ను, అన్ని రోజులూ గుంటూరులో ఉండాలని  సూచించారట. ఈ విషయంపై ఇద్దరి మధ్య పెద్ద చర్చే జరిగిందట. గతంలో మాదిరిగా చేయవద్దని, ఇకపై పూర్తిస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనీ, నాయకులు, ఎమ్మెల్యేలను తరచూ కలుసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మరి తండ్రి మాటను కొడుకు ఎంతవరకూ పాటిస్తాడో చూద్దాం..

మహిళా రిపోర్టర్ పై పాక్ గార్డ్ చేయి...

  ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ మహిళా రిపోర్టర్ పై పోలీసు గార్డ్ చేయి చేసుకున్న ఘటన కరాచీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..  సైమా కన్వల్ అనే మహిళా పాకిస్తాన్లోని కే-21 చానల్లో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కరాచీలోని నాద్రా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లైవ్ రిపోర్టు చేయడానికి అక్కడికి వెళ్లగా.. ఆమెను అక్కడ గార్డ్గా పనిచేస్తున్న ఫ్రాంటియర్ కానిస్టేబులరీ(ఎఫ్సీ) సైనికుడు అడ్డుకున్నాడు. అయితే ఆమె కెమెరా వేరే వైపు పెట్టడంతో ఆగ్రహానికి గురైన అతను ఆమెను చేయి చేసుకున్నాడు. ఇక ఈ తతంగం అంతా వీడియో రికార్డు అవ్వగా అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన కూతురు/చెల్లెలి లాంటి మహిళ జర్నలిస్టుపై చేయిచేసుకున్న ఆ గార్డుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక మహిళా రిపోర్టుపై దాడికి పాల్పడ్డ ఆ ఎఫ్సీ సైనికుడిపై గుల్బహార్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేసినట్టు ఎస్ఎస్పీ సెంట్రల్ ముఖదాస్ హైదర్ పాకిస్తానీ మీడియాకు తెలిపారు.

మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్... సైనిక స్థావరాలే లక్ష్యం

  భారత్ సరిహద్దుల్లో పాక్ తరచూ కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. ఈరోజు మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ కాల్పుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవాను గాయపడ్డారు. పాక్ కాల్పులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

లష్కరే తోయిబా అంటే కొత్త అర్ధం చెబుతున్న చైనా....

  లష్కరే తోయిబా అంటే ఉగ్రసంస్థ అని మనకు తెలుసు.. అయితే దీనికి ఇప్పుడు ఓ కొత్త అర్ధం చెబుతోంది చైనా. పాకిస్థాన్ కు చైనా ఎప్పుడూ సపోర్టుగా ఉంటుదన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇప్పుటికీ చాలాసార్లే ఈ విషయం రుజువైంది. ఇదిలా ఉండగా ఒకవైపు భారత్ సహా అగ్రదేశాలు సైతం పాకిస్థాన్ ఉగ్రవాదంపై ఆగ్రహం వ్యక్త చేస్తున్నాయి. అంతేకాదు పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇప్పటికైనా ఆపాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన చైనా మాత్రం.. పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఆ దేశ సైన్యానికి చెందిన ఓ సైనిక విభాగమని చెప్పుకొచ్చింది. ఎన్ఎస్జీలో చేరడంలో విఫలమైన వారు (ఇండియా) చైనాను నిందిస్తున్నారని ఆరోపిస్తూ, లష్కరే తోయిబా అనే మిలటరీ గ్రూప్ కు చెందిన వ్యక్తిని ఉగ్రవాదిగా చూపాలని ఇండియా ప్రయత్నిస్తోందని 'గ్లోబల్ టైమ్స్'  లో పిచ్చి రాతలు రాసింది. భారత్ తో చైనా సంబంధాలు ఇరు దేశాలకూ ఉపయుక్తకరంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది.  చైనా, భారత్ లు కొన్ని కీలకాంశాల్లో విభేదాలు పక్కనపెట్టి స్నేహపూర్వక బంధాలను కొనసాగించేలా చర్చలు జరుగుతున్నాయని, సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని పేర్కొంది.

టీడీపీ మహిళా నేత ఆత్మహత్య...

  గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్, టీడీపీ మహిళా నేత శ్రీదేవి ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీదేవి మాచర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా పనిచేస్తుంది. అయితే గత కొంతకాలంగా ఆమెకు పెద్దల నుండి ఒత్తిళ్లు ఎదురవ్వడంతో నాలుగు నెలల కిందటే ఆమె తన పదవి నుండి తప్పుకున్నారు. దీనికి తోడు మూడు నెలల క్రితమే ఆమె భర్త కూడా చనిపోయాడు. దీంతో అటు పదవి పోవడం.. ఇటు భర్తను కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీదేవి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శ్రీదేవి మృతిచెందింది.

అఖిలేష్ యాదవ్ పై ములాయం రెండో భార్య చేతబడి...

  ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కుటుంబ రాజకీయాలు పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకుల మధ్య విభేధాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దానికి తోడు మరో వార్త యూపీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన అఖిలేష్ యాదవ్ కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిలోభాగంగానే పార్టీ ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ సింగ్ ములాయంకు ఓ లేఖ రాశారు. అందులో సొంత కొడుకులా చూసుకోవాల్సిన అఖిలేష్ పై సాధన కుట్రలు చేస్తున్నారని.. శివపాల్ యాదవ్ తో కలసి చేతబడులు చేయిస్తున్నారని తెలిపారు. వెంటనే పార్టీ అధ్యక్ష పదవిని అఖిలేష్ కు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీలోని అత్యధికుల అభిప్రాయం కూడా ఇదేనని ఆయన పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్లను పక్కనబెట్టి యువరక్తంతో నింపాలని, అందుకు అఖిలేష్ మాత్రమే ప్రత్యామ్నాయమని తెలిపారు. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో.. దీనివల్ల ములాయం కుటుంబంలో మరెన్ని విబేధాలు తలెత్తుతాయో చూడాలి.