ఉరీ దాడి.. ఉగ్రవాదులు ఎలా వచ్చారంటే..?
posted on Oct 17, 2016 @ 10:56AM
పాకిస్థాన్ ఉగ్రవాదులు ఉరీ సెక్టారులో దాడి జరిపి పలువురు సైనికులను హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే అసలు దాడి జరపడానికి ముష్కరులు అంత ఈజీగా ఎలా ప్రవేశించారన్నది ఆర్మీ విచారణలో తెలిసింది. ఉగ్రవాదులు నిచ్చెన సహాయంతో భారత్ లోకి ప్రవేశించారట. ఎలా అంటే.. పీవోకేలోని సలామాబాద్ నియంత్రణ రేఖ వద్ద కంచె తెగిపోయి చిన్న సందు ఉంది. అక్కడకు నలుగురు ఉగ్రవాదులకు తోడు ఇద్దరు మార్గదర్శకులు రెండు నిచ్చెనలతో అక్కడికి చేరుకున్నారు. అందులో ఓ ఉగ్రవాది ముందుగా ఆ సందుగుండా లోపలికి ప్రవేశించి కంచెకు ఈవలివైపు ఒక నిచ్చెన వేశాడు. అటువైపున ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు మరో నిచ్చెనను కంచెకు ఆనించి వంతెనలా మార్చారు. ఇక అలా వారు భారత్ భూభాగంలోకి ప్రవేశించగానే వారి వెంట వచ్చిన ఇద్దరు నిచ్చెనలను తీసుకెళ్లిపోయారని సైన్యం అంతర్గత నివేదికలో పేర్కొంది. అంతేకాదు వీరు సరిహద్దుల నుంచి గొహల్లన్ లేదా జబ్లా గ్రామాలకు వీరు సెప్టెంబర్ 16 లేదా 17న చేరుకుని ఉంటారని.. ఒక రోజు ఆశ్రయం పొంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ మరసటి రోజు అదనుచూసి సైనికులపై దాడి చేశారని తెలిపారు. కాగా కాశ్మీర్‌లోని ఉరిలో సెప్టెంబరు 18న ఉగ్రవాదులు దాడికి పాల్పడి 19మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసందే.