ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్...ఇప్పుడేం చేద్దాం..
posted on Oct 16, 2016 @ 1:44PM
పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ ఫ్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన పవన్ కూడా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించాలని.. ఇంత జరుగుతున్నా నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు వ్యవహారం పవన్ వరకూ వెళ్లడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. అందుబాటులోని మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ ఈ సమావేశానికి రాగా, వివాదాస్పదమైన ఆక్వా ఫుడ్ పార్క్ వాస్తవ పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ ఏం చెప్పాడని అడిగి తెలుసుకున్న సీఎం, మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, భూములు కోల్పోయే రైతులకు ఆకర్షణీయమైన ప్యాకేజీని తయారు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది.