ఆక్వాఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా పవన్ ను కలిసిన రైతులు.. నేతలు ఏం చేస్తున్నారు.
posted on Oct 15, 2016 @ 5:33PM
పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ పార్క్ ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన పలువురు రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుంతేరు కాలువపై ఆధారపడి 2 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారని..ఆక్వాఫుడ్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని వారు ఆరోపించారు. రైతుల సంతకాల ఫోర్జరీ చేసి, పరిశ్రమకు గ్రామీణులు అనుకూలమని ప్రభుత్వం ప్రకటించిందని వారు విమర్శించారు. ఆ తరువాత తాము అభ్యంతరం చెప్పడంతో యువకులపై పెద్దపెద్ద సెక్షన్లతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, రైతులు అన్ని పార్టీల నేతల వద్దకు తిరిగినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి అన్నం పెట్టేది ఉభయ గోదావరి జిల్లాలే.. సమస్యలు చెప్పుకునే అవకాశం బాధితులకు ఇవ్వాలి..ఇంత గొడవ జరుగుతున్నా నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. పార్క్ ఏర్పాటుపై యాజమాన్యం మరోసారి ఆలోచించాలి.. నేను పారిశ్రామికి ప్రగతికి అనుకూలమే.. కానీ పంటలకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో మాత్రమే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.. పార్క్ వల్ల జీవనదులు కలుషితమవుతున్నాయి అని అన్నారు. ఇలాంటి గొడవలు వచ్చినప్పుడే కులపోరాటాలే మొదలవుతాయి.. ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే ఇదో నందిగ్రామ్ అవుతుంది..ఒక చిన్న ఊరిలో 144 సెక్షన్ ఎందుకు పెట్టారు అని ప్రశ్నించారు.