కష్టాల్లో కివీస్... భారత్ ముందు స్వల్ప లక్ష్యం..
posted on Oct 16, 2016 @ 4:54PM
భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్ట్ సిరీస్లో ఓడిపోయిన కివీస్ జట్టు ఇప్పుడు గెలవడానికి బాగానే కష్టపడుతోంది. అయితే న్యూజిలాండ్ జట్టుకు భారత సిరీస్ అస్సలు కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. ప్రతి జట్టును మట్టికరిపించడంలో కివీస్ ఆటగాళ్లను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి కివీస్ జట్టు భారత్ తో సిరీస్ ప్రారంభం నుంచి ఏమాత్రం ఆటరానట్టు ఆడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ పెవిలియన్ కు చేరకుంటున్నారు. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. న్యూజిలాండ్ 65 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఓపెనర్ టామ్ లాధమ్(79 నాటౌట్;98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. కివీస్ వికెట్లు పడుతున్నా ఓపెనర్ గా వచ్చిన లాధమ్ మాత్రం పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇక 106 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన టిమ్ సౌతీ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు ఊపిరులూదాడు. టామ్ లాధమ్ తో కలిసి 71 పరుగులు భాగస్వామ్యాన్ని అందించాడు. మొత్తానికి 43.5 ఓవర్లలో 190 పరుగులు చేసి కివీస్ టీమ్ ఆలౌటైంది. కేవలం 191 పరుగులతో స్వల్ప లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.