ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.... 23 మంది సజీవదహనం
posted on Oct 18, 2016 @ 10:18AM
ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కార్పొరేట్ ఆస్పత్రి లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం..ఒడిశా రాజధాని అయిన భువనేశ్లర్లోని అతిపెద్ద ఆస్పత్రి అయిన ఎస్‌యూఎంలోని మంటలు చెలరేగాయి. తొలుత డయాలసిస్ వార్డులో మంటలు చెలరేగగా.. అవి వెంటనే ఐసీయూకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 23 మంది సజీవ దహనమవ్వగా.. వందమందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే వందమంది అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఆస్పత్రిలోని ఇతర వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించారు. బ్రోంటో స్కైలిఫ్ట్‌లను ఉపయోగించి పై అంతస్తుల్లో ద్వారాలు, కిటికీలు బద్దలుగొట్టి అక్కడ చిక్కుకుపోయిన రోగులను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.