బీసీసీఐకి కోర్టులో ఊరట...
posted on Oct 17, 2016 @ 5:26PM
లోథా కమిటీ సిఫార్సులను బీసీసీఐ పట్టించుకోవడం లేదని సుప్రీంకోర్టు ఇప్పటివరకూ పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కాస్త బీసీసీఐకి కోర్టులో ఊరట లభించినట్టు కనిపిస్తోంది. లోథా ప్యానెల్ సిఫారసుల అమలుపై కోర్టులో వాదనలు జరగగా.. లోధా ప్యానెల్ సిఫారసులను అమలు చేయడానికి తమకు మరింత సమయం కావాలని.. వీటి అమలుకు తమ రాష్ట్ర సంఘాలన్నింటినీ ఒప్పించడానికి మరింత సమయం పడుతుందని బోర్డు కోరింది. దీనికి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మన్నించి.. ప్రస్తుతానికి కోర్టు తమ తీర్పు వెలువరించలేదు. అయితే కాంట్రాక్టులు, టెండర్లు వంటి ఆర్థిక విషయాల్లో బోర్డు అధికారాలకు కత్తెర వేయాలని మాత్రం కోర్టు భావిస్తోంది. కాగా అక్టోబర్ 7న చివరిసారి దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. సిఫారసులు అమలు చేయనంత వరకు రాష్ట్ర సంఘాలకు నిధులు విడుదల చేయొద్దని బీసీసీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.