ములాయం, అఖిలేష్ మధ్య వాగ్వాదం...

  ములాయం సింగ్ నేతృత్వంలో లక్నోలోని పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొడుకు అఖిలేష్ యాదవ్ కు, తన సోదురుడు శివపాల్ యాదవ్ కు మధ్య విబేధాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో ములాయం సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు సమావేశంలో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో నిజంగానే ములాయం చేసిన వ్యాఖ్యలు అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎందుకంటే.. ఎప్పుడూ ప్రధాని మోడీపై విరుచుకుపడే ఆయన.. ఈసమావేశంలో మాత్రం ఆయనపై ప్రశంసలు కురిపించారు. "మన ప్రధాని మోదీని చూడండి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన అకుంఠిత శ్రమతో ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయన అంకిత భావం చాలా గొప్పది. తన తల్లిని ఎన్నటికీ వీడనని ఎల్లవేలలా ఆయన చెబుతూనే ఉంటారు. మోదీకి తన తల్లి ఎలాగో, తనకు శివపాల్ యాదవ్, అమర్ సింగ్ అంతే. వారిద్దరిని కూడా నేను ఎన్నటికీ వదలను", అని అన్నారు. తన కోసం, పార్టీ కోసం తన తమ్ముడు శివపాల్ చేసిన కృషిని తాను ఎన్నడూ మరవనని.. అమర్ సింగ్ తను సొంత తమ్ముడిలాంటి వాడని, కష్ట సమయాల్లో ఎన్నోసార్లు తన వెన్నంటే నిలిచాడని అన్నారు. అమర్ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయాయని... ఆయనను తప్పుబట్టడానికి ఏమీ లేదని అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోకుంటే అఖిలేష్‌ను పార్టీ నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడమని తేల్చిచెప్పారు.  విమర్శలు ఎదుర్కొనే సత్తా లేని వారు నాయకుడిగా ఎదగలేరు అని అఖిలేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.   ఇదిలా ఉండగా ములాయం చేసిన వ్యాఖ్యలకు కొడుకు అఖిలేష్ యాదవ్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తనపై ఆరోపణలు చేసిన అమర్ సింగ్ ను ములాయం వెనకేసుకురావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తినట్టు కనిపిస్తోంది. పార్టీ పెడుతున్నట్లు తాను ఎప్పుడూ చెప్పలేదని.. సీఎం పదవికి రాజీనామా చేయమంటే చేస్తానని కంటతడిపెట్టారు. తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పింది మీరే కదా అని ములాయంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  అమర్‌సింగ్ వల్లే పార్టీలో విబేధాలు వచ్చాయని తెలిపారు. మరి ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు చోటుచేసుకుంటాయో చూడాలి.

స్వరూపానంద స్వామికి భూతం ప‌ట్టింది.. బాబా భక్తుల ఆగ్రహం...

  ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సాయిబాబా అసలు దేవుడు కాదని.. ఏ శాస్ర్తీయ ప్రమాణాల ద్వారా బాబాను పూజిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ భూతాన్ని భ‌క్తులు పూజిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు స్వరూపానంద స్వామిపై సాయిబాబా భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యల ప‌ట్ల‌ హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌న‌గ‌ర్ సాయిబాబా ఆల‌యం వ‌ద్ద భ‌క్తులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు. స్వ‌రూపానంద‌ను పిచ్చాసుప‌త్రిలో చేర్చాలంటూ సాయిబాబా భ‌క్తులు నినాదాలు చేస్తున్నారు. త‌మ‌ను చ‌ర్చ‌ల‌కు పిలిస్తే స్వ‌రూపానంద నోరు మూయిస్తామ‌ని దేవస్థాన పెద్ద‌లు సవాలు విసురుతున్నారు. స్వ‌రూపానంద‌కు భూతం ప‌ట్టిందని అన్నారు. ద‌మ్ముంటే చ‌ర్చ‌ల‌కు రావాల‌ని అన్నారు. సాయిబాబాపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే ఊరుకునేదిలేద‌ని సాయి భ‌క్తులు హెచ్చ‌రిస్తున్నారు. సాయిబాబాను దెయ్యం, భూతం అంటూ త‌మ‌ను స్వ‌రూపానంద రెచ్చ‌గొడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మరి గతంలో ఒకసారి ఈ విషయంపై పెద్ద దుమారం రేగగా... ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఎంత ఉద్రిక్తంగా మారుతుందో.. చర్చకు  స్వరూపానంద స్వామి ఓకే చెబుతారో లేదో చూడాలి.

కొత్తపార్టీ లేదు... సీఎం పదవికి రాజీనామా చేస్తా..

  యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది ములాయం కుటుంబంలో రాజకీయ విబేధాలు కూడా ఎక్కువగా బయటపడుతున్న సంగతి తెలిసిందే. రోజుకో కొత్త అంశం బయటపడుతుంది. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఈ పార్టీతోనే వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారన్న కథనాలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలపై స్పందించిన అఖిలేష్ యాదవ్ తాను ఎట్టి పరిస్థితిలోనూ కొత్త పార్టీ పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.  ఈరోజు ఎస్పీ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలు మాత్రమే అని తెలిపారు. అంతేకాదు  పార్టీ చీఫ్ ములాయం సింగ్ కోరుకుంటే సీఎం పదవికి కూడా రాజీనామా చేస్తానని కూడా తెలిపారు.  అమర్ సింగ్ వ్యాఖ్యలు తనను బాధ పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పార్టీ పెట్టబోనని తేల్చిచెప్పారు.

రచ్చకెక్కిన సమాజ్ వాదీ పార్టీ గొడవలు....

  యూపీలో సమాజ్ వాదీ పార్టీ కుటుంబ రాజకీయాలతో రచ్చ కెక్కుతుంది. ఇప్పటికే కుటుంబ రాజకీయాలతో పలు ఇబ్బందులు పడుతున్న పార్టీకి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒకపక్క రాష్ట్ర‌ కేబినెట్ నుంచి శివపాల్‌ను తప్పించడం, అఖిలేష్‌కు మద్దతుగా రాంగోపాల్ నిల‌వ‌డం, ములాయం సింగ్ యాద‌వ్‌ అఖిలేష్‌ను పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష‌ పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ వ‌ర్గాల్లో హై టెన్ష‌న్ వాతావ‌రణం నెల‌కొంది. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ లక్నోలోని స‌మాజ్‌వాదీ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. అయితే కార్యాల‌యం వ‌ద్ద స‌మాజ్‌వాదీ పార్టీ మ‌ద్ద‌తుదారులు, తిరుగుబాటుదారుల మ‌ధ్య గొడ‌వ జరగడంతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహ‌రించారు. కాగా మరికాసేపట్లో ములాయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో భేటీ కానున్నారు.

ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్... 18 మంది మావోయిస్టులు మృతి

  ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ఏవోబీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒడిశా సరిహద్దులోని అటవీప్రాంతం చిత్రకొండ, జెంత్రీ మధ్యలో బూసుపట్టి ఏరియాకు 10 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టుల ప్లీనరీ సమావేశం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.  గ్రేహౌండ్స్ దళాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా ఏవోబీని జల్లెడపట్టగా.. సోమవారం ఉదయం మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టులను చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో నాలుగు ఏకే 47 తుపాకులు, రైఫిల్స్‌తో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది మావోయిస్టులు తప్పించుకుపోయినట్లు తెలుస్తోంది. తప్పించుకుపోయిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కాల్పుల్లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ల ద్వారా ఒడిశాలోని ఆస్పత్రులకు తరలించారు.   కాగా మృతుల్లో పలువురు మావో అగ్రనేతలు ఉన్నట్టు తెలుస్తోంది.  ఇంకా మృతి చెందిన వారిలో గాజర్ల రవి, చలపతి, దయ, రాజన్న, బెంగాల్ సుధీర్, అశోక్, మున్నాలను గుర్తించారు. మావోయిస్టు అగ్రనేత కొడుకే మున్నా అని సమాచారం.

చైనా బోర్డర్లో ప్రత్యక్షమైన డ్రాగన్..

డ్రాగన్..చైనీయులకు ఆరాధ్య జంతువు.  ఇవి అత్యంత శక్తిమంతమైన ప్రాణులని చైనా పురాణాల్లో పేర్కొన్నారు. పవిత్ర శక్తులు కలిగివుండే డ్రాగన్లు నీరు, వర్షం, ప్రకృతి విపత్తులపై అధికారం కలిగివుంటాయని చైనీయుల నమ్మకం. అందుకే చైనాను పాలించిన రాజులు డ్రాగన్‌ను వాళ్ల శక్తి, సామర్థ్యాలకు గుర్తుగా ఎంచుకున్నారు.  డ్రాగన్‌ను పురాణాల్లో చదవడమో..పెద్దలు చెప్పగా వినడమో తప్ప ఎవ్వరూ చూసింది లేదు. అయితే చైనా-లావోస్ బోర్డర్లో ఓ వ్యక్తి తాను డ్రాగన్‌ను చూశానని చెబుతున్నాడు. అది గాల్లో ఎగురుతున్నపుడు సెల్‌ఫోన్‌లో బంధించానని సాక్ష్యంగా వీడియో చూపిస్తున్నాడు. అంతేకాదు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు డ్రాగన్లు నిజంగానే ఉన్నాయంటే మరికొందరు మాత్రం ఇది టెక్నాలజీ మాయ అని కామెంట్ చేస్తున్నారు. 

మంత్రులపై..మోడీ సంచలన నిర్ణయం

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోన్న ప్రధాని నరేంద్రమోడీ మరో సంచలనానికి తెరలేపారు. కేంద్రమంత్రులు కేబినెట్ సమావేశాలకు ఇక నుంచి సెల్‌ఫోన్‌లు తీసుకురావడాన్ని నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల ఫోన్లను దుండగులు హ్యాక్ చేసి, సమావేశాల్లో చర్చించే సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని మంత్రులకు అందించి, వారు సమావేశాలకు సెల్‌ఫోన్లు తీసుకురాకుండా చూడాలని కేబినెట్ సెక్రటేరియేట్ మంత్రుల ప్రైవేట్ కార్యదర్శులను ఆదేశించింది.

బాబాయిపై అఖిలేష్ వేటు

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే తండ్రి, కొడుకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా తాజాగా అఖిలేష్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఆ దూరాన్ని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ యూపీ చీఫ్, బాబాయి శివపాల్‌ యాదవ్‌ను సీఎం అఖిలేష్ కేబినెట్ నుంచి తొలగించారు. శివపాల్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులపైనా ఆయన వేటు వేశారు. రాష్ట్రంలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులతో ముఖ్యమంత్రి అఖిలేష్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తనకు వ్యతిరేకంగా లేదా అమర్‌సింగ్‌కు అనుకూలంగా వ్యవహరించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోనని ఆ సమావేశంలో అఖిలేష్ హెచ్చరించాడట. అన్న మాట ప్రకారం శివపాల్‌ యాదవ్‌తో పాటు షబాబ్ ఫాతిమా, ఓం ప్రకాశ్, నారద్ రాయ్‌లపై వేటు వేశాడు. మరోవైపు అమర్‌సింగ్ అనుచరులుగా ఉన్న నలుగురు మంత్రులతో పాటు నామినేటేడ్ పదవులు అనుభవిస్తున్న వారిపైనా చర్యలు తప్పదని భావిస్తున్నారు.

హిల్లరీని తొక్కేస్తున్న ట్రంప్... సర్వేల షాకులు

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు బరిలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత కొద్ది నెలల క్రితం హిల్లరీ క్లింటన్ కంటే ట్రంప్ ముందడుగులో ఉండగా.. ఎప్పుడైతే అతని నోటి దురుసుతనం ఎక్కువవడం.. దానికి తోడు మహిళల ఆరోపణలు అన్నీ కలిసి రావడంతో ట్రంప్ ను వెనక్కి నెట్టి హిల్లరీ ముందుడు వేశారు. ఇంకా జరిగిన మూడు డిబేట్లలో హిల్లరీ మంచి మార్కులు సంపాదించడంతో గెలుపు అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. దానికి తోడు పలు సంస్థల సర్వేలు కూడా హిల్లరీ క్లింటన్ కే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలిపాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్టు కనిపిస్తోంది.   రాయిటర్స్ వార్తా సంస్థ సంచలన సర్వే ఫలితాలను వెల్లడించింది. ప్రముఖ మార్కెటింగ్, సర్వే సంస్థ ఇప్సోతో కలిసి రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యానికి భారీగా గండికొట్టినట్లు తేలింది. అక్టోబర్ 14 నుంచి 20 మధ్య కాలంలో ట్రంప్ తన ఆధిక్యతను 40 శాతం నుంచి 44 శాతానికి పెంచుకున్నారని, అదే సమయంలో హిల్లరీ ఆధిపత్యానికి భారీగా తగ్గించగలిగారని సర్వేలో పేర్కొన్నారు. అక్టోబర్ 7-13 మధ్య హిల్లరీకి 44 శాతం, ట్రంప్ కు 37 శాతం మద్దతు దక్కింది. నిజానికి జాతీయ సరాసరిలో ఇప్పటికీ ట్రంప్ పై హిల్లరీ ఆధిపత్యమే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ట్రంప్ కు 41.9 శాతం మద్దతు లభిస్తే అతని కంటే 6.2 శాతం ఎక్కువ అంటే, 48.1 శాతం ఆధిక్యత హిల్లరీకి ఉంది. పోలింగ్ కు ఇంకా రెండు వారాలు గడువుండటంతో ఆ మాత్రం తేడాను కూడా ట్రంప్ అధిగమిస్తాడనే అభిప్రాయం వ్యక్తమైంది. మరి ఎన్నికలకు ఇంకా రెండు వారాలు గడువు ఉంది. అప్పటిలోగా ఏం జరుగుతుందో.. ఎవరు గెలుస్తారో అని అమెరికన్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

భారత్ పై పాక్ కాల్పులు... వీడియో విడుదల

  భారత్ సైన్యంపై పాక్ సైన్యం తరచూ కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్ సైన్యంపై దాడి జరిపిన భారత్ సైన్యం.. హిరానగర్ సెక్టార్‌లో పాక్ రేంజర్లను హత మార్చిన సంగతి తెలిసిందే. ఆరుగురు  పాక్ రేంజర్లను, ఓ ఉగ్రవాదిని భారత్ సైన్యం హతమార్చినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన థర్మల్ ఇమేజెస్, వీడియోను బీఎస్ఎఫ్ విడుదల చేసింది. బీఎస్ఎఫ్ ఔట్‌పోస్ట్‌లపై బాంబులు విసురుతూ, ఆ తర్వాత జవానులు జరిపిన కాల్పుల నుంచి తప్పించుకోవడానికి వారు కిందకు వంగుతూ, సమయం చూసి తిరిగి దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. కాగా శుక్రవారం ఉదయం 9.35 గంటల సమయంలో కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో భారత ఔట్‌పోస్ట్‌లపై పాక్ రేంజర్లు స్నైపర్ దాడులు జరిపారని బీఎస్‌ఎఫ్ తెలిపింది. దీంతో భారత బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని, ఏడుగురు పాక్ రేంజర్లు, ఓ ఉగ్రవాది మరణించారని బీఎస్‌ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు.

అక్కడ కూడా మనమే.. భారత్ సైన్యానికి స్వర్ణ పతకం..

  పాక్ పై భారత్ సర్జికల్ దాడులు చేసిన నేపథ్యంలో.. పాకిస్థాన్ తరచూ భారత్ సరిహద్దులో కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. పాక్ కాల్పులకు భారత్ సైన్యం కూడా ధీటుగా సమాధానం చెబుతుంది. అయితే ఇప్పుడు మన సైన్యానికి స్వర్ణ పతకాలు లభించాయి. పాక్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదంపై పోరాటంలోనే కాదు అంతర్జాతీయ మిలిటరీ పోటీల్లోనూ మాకు మేమే సాటి అని భారత సైన్యం నిరూపించింది.  8 గూర్ఖా రైఫిల్స్‌లోని రెండో బెటాలియన్‌కు చెందిన 8 మంది సభ్యులకు స్వర్ణ పతకాలు అందాయి. కాగా వేల్స్‌లోని గరుకైన, ఎగుడు దిగుడు రాళ్లతో ప్రమాదకరంగా ఉండే కాంబ్రియన్‌ పర్వతాల్లో ఈ అంతర్జాతీయ పోటీని ఏటా నిర్వహిస్తారు. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ప్యాట్రోల్‌ ఎక్స్‌ర్‌సైజుల్లో ఇదొకటి. ఈ పోటీల్లో అద్భుత ప్రతిభ కనపరచి.. 8 మంది భారత సైన్యం స్వర్ణ పతకాలు సాధించారు. దీనికి గాను బ్రిటిష్‌ ఆర్మీ సైతం బృందానికి అభినందనలు తెలిపింది.

హెలికాఫ్టర్ కూలి 19 మంది మృతి...

హెలికాఫ్టర్ కూలి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. క్రస్నోయార్క్‌ రీజియన్‌ నుంచి ఉరెంగోయ్‌ వెళుతున్న ఎంఐ-8 హెలికాప్టర్ ఈశాన్య సైబీరియాలో కుప్పకూలిపోయింది. హెలికాప్ట‌ర్‌లో మొత్తం 22 మంది ఉండగా... 19 మంది మరణించగా.. మరో ముగ్గురు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు ప్రతికూల వాతావరణమే కారణమని చెబుతున్నారు అధికారులు. ఘటనా స్థలం నుంచి రెండు బ్లాక్ బాక్స్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 140 మంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు. శిథిలాల్లో చిక్కుకున్న ఓ వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా రెస్క్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

జయలలిత 10 రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారు..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత నెల రోజుల నుండి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను ఇప్పటివరకూ పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్సించారు. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు తెదేపా నేతలు జయలలితను పరామర్శించడానికి చెన్నై వెళ్లారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీలు మురళీ మోహన్‌, సీఎం రమేశ్‌ తదితరులు అపోలో ఆసుపత్రికి వెళ్లి జయను పరామర్శించారు. అనంతరం సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత ఆరోగ్యం 95శాతం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అవసరమని, 10 రోజుల్లో డిశ్చార్జ్‌ అవుతారని వైద్యులు చెప్పారని తెలిపారు. అశ్యర్యం ఏంటంటే.. ఎంత మంది వెళ్లినా ఆమెను చూడకుండానే వస్తున్నారు. అక్కడికి వెళ్లడం.. వైద్యులతో మాట్లాడటం ఇదే సరిపోతుంది.

యథా ట్రంప్ తథా అనుచరులు...

  ఒకపక్క ట్రంప్ తన వ్యాఖ్యలతో ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ అనుచరులు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య జర్నలిస్టులపై ట్రంప్ తన దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. పెనిస్విలేనియాలో ట్రంప్ నిర్వహించిన ఓ ఈవెంట్లో దాదాపు ఐదు వేల మంది పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగించిన అనంతరం.. మీడియా ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా.. దానికి ట్రంప్ జర్నలిస్టులతో మాట్లాడటం తనకు ఇష్టం లేదని, మీరు అబద్ధాలకోరులని తిట్టిపోశాడు. ట్రంప్ అనుచరులైతే రెచ్చిపోయి కొందరు జర్నలిస్టులను నెట్టివేస్తూ వారిపై చెయ్యి చేసుకున్నారు కూడా.  మీ చేతిలో ఉన్న మైక్స్ కింద పడేస్తాను అంటూ ట్రంప్ మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. అసలు మీరు ఎవరో తెలియదు, ఇక్కడి ఎందుకు వచ్చారంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. మొత్తానికి యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. ట్రంప్ ఎలా ఉంటే వారి అనుచరులు కూడా అలాగే ఉంటారని అర్ధమైంది.

అభిమాని కోరిక తీర్చిన మోడీ...

  ప్రధాని నరేంద్ర మోడీకి అప్పుడప్పుడు కొంతమంది లేఖలు రాస్తుంటారు. వాటికి ప్రధాని మోడీ కూడా స్పందించి జవాబులు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాన జంట రాసిన లేఖకు స్పందించిన మోడీ వారి కోరికను తీర్చారు. అసలుసంగతేంటంటే.. గుజరాత్ లోని ఓ మిర్జాపూర్ జంట కూడా ప్రధాని మోదీపై ఉన్న అమితమైన ఆరాధనతో, తమకు పుట్టిన పాపకు మోదీతో పేరు పెట్టించుకోవాలనుకున్నారు. దీంతో తమ అభిలాషను ఓ లేఖ ద్వారా ప్రధానికి తెలియజేశారు. వెంటనే స్పందించిన ప్రధాని, వారికి పుట్టిన పాపకు తాను పేరు పెడుతున్నట్టు ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కాల్ చేశారు. "హలో, నేను నరేంద్రమోదీని, మీ భార్య విభ సింగ్ రాసిన ఉత్తరం నాకు అందింది. పాపు పుట్టినందుకు శుభాకాంక్షలు. నా ఆశీస్సులు ఎల్లవేళలా మీ పాప తోడుంటాయి. పాప పేరు వైభవిగా నామకరణం చేస్తున్నా. ఈ పేరు తల్లిదండ్రుల ఇద్దరి పేర్ల కలయిక" అని విభ సింగ్ భర్త భరత్కు ఫోన్ లైన్లో తెలిపినట్టు అతను చెప్పాడు.