12 మంది అధికారులపై వేటు... జాతి వ్యతిరేక కార్యకలాపాలు
posted on Oct 20, 2016 @ 10:13AM
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 మంది అధికారులపై వేటు పడింది. ఈ ఘటన జమ్మూకాశ్మీర్లో చోటుచేసుకుంది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో కశ్మీర్ యూనివర్శిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ సహా.. విద్యాశాఖ, రెవెన్యూ, వైద్యారోగ్య, ఇంజినీరింగ్, పౌర సరఫరాల శాఖల్లోని 12 మంది అధికారులను విధుల నుంచి తొలగించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో జరిగిన అల్లర్ల సమయంలో ఈ 12 మంది అధికారులు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలిందని.. దీనికి సంబంధించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పోలీసులు అందించారని వెల్లడించారు. నివేదికలను పరిశీలించిన అనంతరం.. ఉద్యోగులను తొలగించాలంటూ సదరు శాఖలకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. వీరిలో కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు.