పదవిలో కొద్దికాలంపాటే..

టాటా గ్రూప్ ఛైర్మన్ గా సైరస్ మీస్త్రీని తొలగించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ప్రస్తుతానికి రతన్‌టాటానే బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. టాటా గ్రూప్‌ ఛైర్మన్‌గా కొద్దికాలంపాటే తాను పదవిలో కొనసాగుతానని... ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు సంస్థ స్థిరత్వం, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాత్కాలిక ఛైర్మన్‌ పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త వ్యక్తి త్వరలోనే నాయకత్వ బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడించారు. నాయకత్వం మారినా గ్రూప్‌ కంపెనీల సభ్యులు వ్యాపారంపై పూర్తి దృష్టి సారిస్తారని అభిప్రాయపడ్డారు. టాటా సన్స్‌ ప్రకటించిన ఎంపిక కమిటీ నూతన ఛైర్మన్‌ను ఎంపిక చేస్తుందని, ఈ ప్రక్రియ సుమారు 4నెలలు పట్టే అవకాశం ఉందని రతన్‌ టాటా పేర్కొన్నారు.

మేమంతా ఒక్కటే.. సమావేశానికి రాని అఖిలేష్..

యూపీ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం కుటుంబంలో ఉన్నకుటుంబ విబేధాలు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ములాయం తనయుడు, ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ కి.. ఆయన బాబాయి అయిన శివపాల్ యాదవ్ కి మధ్య ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయం అర్థమైంది. అయితే ఎన్నిసార్లు గొడవలు బయటకి కనిపించినా ములాయం మాత్రం మా మధ్య అలాంటివి ఏం లేవు అని చెప్పుకొస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ రోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ములాయం.. మా కుటుంబం అంతా కలిసే ఉంది.. మా లక్ష్యమంతా ఒక్కటే.. మేమంతా ఒకే ఫ్యామిలీ ఒకే పార్టీ అని అన్నారు. పార్టీ ఇమేజ్ ను అఖిలేష్ మార్చారు.. సీఎంగా అఖిలేషే కొనసాగుతారు అని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రతి విషయంలో అమర్ సింగ్ ను ఎందుకు తీసుకొస్తారు.. బయటివాళ్లే పార్టీలో గొడవలు సృష్టిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అంతా బాగానే ఉన్నా... ములాయం మేమంతా ఒకటే అని చెబుతున్నా.. అఖిలేష్ మీడియా సమావేశానికి రాకపోవడం గమనార్హం.

ఎంపీలతో రాజీనామాలు చేయిస్తా..జగన్

  వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో యువభేరి నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాన్ని గురించి యువ‌త‌కు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆ రోజు ప్ర‌త్యేక హోదాపై మాట్లాడిన నాయ‌కులు ఈ రోజు మ‌రోమాట మాట్లాడుతున్నార‌ని అన్నారు. ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తేనే ఉద్యోగాలు వ‌స్తాయ‌న్న‌ది వాస్త‌వమ‌ని.. ప‌రిశ్ర‌మ‌ల కోసం అప్పుడు హోదా కావాలి అన్న నాయ‌కులే మాట‌మార్చి ఇప్పుడు హోదాతో ప‌రిశ్ర‌మ‌లు, ఉద్యోగాల‌కు సంబంధం లేద‌ని చెబుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఆ రోజు మాటిచ్చి రాష్ట్రాన్ని విడ‌గొట్టార‌ని, పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌త్యేక హోదాపై హామీ ఇచ్చారని అన్నారు. విశ్వాసం, విశ్వసనీయత లేకుండా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. మాట తప్పిన నేతలను ప్రజలు గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సమావేశాల్ని సైతం స్తంభింపజేస్తామని.. ఎంపీలతో రాజీనామాలు సైతం చేయిస్తామని చెప్పారు.

కోర్టులోనే జుట్టు కత్తిరించుకున్న ప్లేయర్..

  సాధారణంగా కోర్టుల్లో ఉన్నప్పుడు ప్లేయర్లు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఓడిపోతున్నామన్న బాధతోనో... లేక గెలుస్తున్నామన్న ఆనందంతోనో వింత చేష్టలు చేస్తుంటారు. ఇప్పటి వరకూ చాలా మందినే చూసుంటాం.. అలాంటిదే ఇప్పుడు టెన్నిస్ కోర్టులో చోటుచేసుకుంది.  సింగ‌పూర్ ఓపెన్‌లో భాగంగా స్వెత్లానా కుజ్నెత్సోవా  ర‌ద్వాంస్కా మధ్య మ్యాచ్ జ‌రుగుతుంది. దాదాపు మూడు గంట‌ల పాటు హోరాహోరీగా జ‌రిగిన మ్యాచ్‌లో కుజ్నోత్సోవా తీవ్ర ఒత్తిడికి లోనైంది. కోర్టులోనే బిగ్గ‌ర‌గా ఏడ్చేసింది. మూడో సెట్‌లో లీడ్‌లో ఉన్నా.. తొమ్మిదో గేమ్‌లో స‌ర్వీస్ కోల్పోయి రద్వాంస్కాకు ఆధిక్యం క‌ట్ట‌బెట్టింది. దీంతో కుజ్నెత్సోవా మ‌రింత కుంగిపోయింది. చివ‌రికి మ్యాచ్ పాయింట్‌కు ముందు రెండు క‌త్తెర్లు తీసుకొని త‌న‌ పోనీ టెయిల్ చివ‌ర జుట్టును క‌త్తిరించుకుంది. దీంతో అక్కడున్నవారందరూ ఆమె చేసిన పనికి షాకయ్యారు. చివ‌రికి ఈ మ్యాచ్‌లో ఆమె 7-5, 1-6, 7-5 తేడాతో రద్వాంస్కాపై గెలిచింది.

త్వరలో ఇంటికి అమ్మ.. ఆనందంలో తమిళ తంబిలు

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు గత కొద్ది రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుంటున్నట్టు... త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జయలలిత ఆరోగ్యం  మెరుగుపడిందని.. అంతేకాదు, అన్నీ సవ్యంగా జరిగితే, ఈ ఆదివారం ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఈ విషయాన్ని స్వయంగా చెన్నైలోని అపోలో వైద్యులే వెల్లడించారు. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. దీపావళిని ఘనంగా నిర్వహించుకునేందుకు తంబిలు రెడీ అవుతున్నారు. కాగా గత నెల 22న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో జయ అడ్మిట్ అయ్యారు.

ఏపీ హోం మంత్రికి గాయాలు..

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చిన రాజప్పకు గాయాలయ్యాయి. కాకినాడలోని పెద్దాపురం మండలం కట్టమూరు వద్ద రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే అక్కడి సంజీవని ఆసుపత్రిలో మూడో అంతస్థు నుంచి లిఫ్టులో కిందకు వస్తుండగా లిఫ్టు వైరు ఒక్కసారిగా తెగిపోవడంతో ఆయన పడిపోయారు. దీంతో ఆయన నడుము భాగంలో గాయాలయ్యాయి.  అదే ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మంత్రి గారితో పాటు కానిస్టేబుల్‌, ఫోటో గ్రాఫర్‌ కూడా ఉండగా.. వారికి కూడా గాయాలయ్యాయి. వారికి కూడా చికిత్స అందిస్తున్నారు.

ఏవోబీ.. మళ్లీ ఎదురు కాల్పులు.. ముగ్గురు మృతి

  ఏవోబీ (ఆంధ్రా-ఒడిశా సరిహద్దు) నిన్నటి నుండి పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. నిన్నజరిపిన కాల్పుల్లో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈరోజు మళ్లీ ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ రోజు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య 27కు చేరింది. మల్కన్‌గిరి జిల్లా అటవీ ప్రాంతంలోని రామ్‌గఢ్-పనస్‌పుట్ సమీపంలోనే తాజా ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల మృతదేహాలకు రాత్రే పోస్టుమార్టం పూర్తయిందని.. మృతదేహాలు మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో ఉన్నాయని.. బంధువులు వస్తే మృతదేహాలు అప్పగిస్తామని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఒకవేళ మృతదేహాలను ఏపీ, తెలంగాణకు తరలిస్తే ఈ నెల 27వ తేదీ వరకు భద్రపరచాలని ఉమ్మడి హైకోర్టు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది.

రక్తసిక్తమైన పాకిస్థాన్... పోలీస్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాడి

  పాకిస్థాన్ లో ఈ మధ్య తరచూ ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోమారు ఉగ్రదాడులతో పాకిస్థాన్ రక్తసిక్తమైంది. క్వెట్టాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలూచిస్థాన్ పోలీస్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ శిక్షణా కేంద్రంలో మొత్తం 700 మంది ఉండగా.. ఈ ఘటనలో 59 మంది మృతి చెందగా  118 మంది గాయపడ్డారు. జరిగిన ఘటనపై స్పందించిన బలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తి ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడుల్లో ఇది మూడోదని.. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని.. మిగిలిన ఉగ్రవాదులు కాలేజీ వసతి గృహంలో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ దాడికి పాల్పడింది.. పాకిస్థాన్ తాలిబన్‌కు అనుబంధమైన లష్కరే ఝంగ్వి ఉగ్రవాద సంస్థకు చెందిన అల్-అలిమి ఫ్యాక్షనే అని తమ వద్ద సమాచారం ఉందని మంత్రి తెలిపారు.

ఏఓబీ.. పెరుగుతున్న మృతుల సంఖ్య... ఒక కానిస్టేబుల్ మృతి

  ఏఓబీ ప్రాంతంలో  పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల  24కు చేరింది. మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ఏవోబీకి పది కిలో మీటర్ల దూరంలో ఒడిశా మల్కాన్ గిరి జిల్లా రామగుర్హా ప్రాంతంలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపారు. మావోలు కూడా ఎదురు కాల్పులకు దిగారు.   ఇదిలా ఉండగా ఘటనా స్థలంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు  అజీజ్ బాషా, డి.సతీష్‌ లలో  ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని  హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం తరలిస్తుండగా అజీజ్ బాషా మార్గమధ్యంలోనే మరణించారు. మరో కానిస్టేబుల్ డి.సతీష్‌ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్రిపుల్ త‌లాఖ్‌ పై మోడీ.. రాజకీయం చేయోద్దు...

  ట్రిపుల్ తలాఖ్ విధానంపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన మోడీ ట్రిపుల్ తలాఖ్ ను రాజకీయం చేయోద్దని కోరారు. యూపీలోని మ‌హోబాలో జ‌రిగిన బుందేల్‌ఖండ్ ప‌రివ‌ర్త‌న్ ర్యాలీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ..  మ‌హిళ‌ల‌కూ స‌మాన హ‌క్కుల‌ను ఇవ్వ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లూ తీసుకుందామ‌ని..  టీవీ చర్చ‌ల్లో పాల్గొనే వ్య‌క్తులు ట్రిపుల్ త‌లాఖ్‌ను హిందూ, ముస్లిం మ‌ధ్య‌ అంశంగా చేయొద్ద‌ని మోదీ కోరారు. ఇది అభివృద్ధికి సంబంధించిన అంశ‌మ‌ని.. కొంతమంది కేవ‌లం ఓట్ల కోసం ముస్లిం మ‌హిళ‌ల‌కు ఉండాల్సిన హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నార‌ని మోదీ విమ‌ర్శించారు. ఓ వ్య‌క్తి ఫోన్లో మూడుసార్లు త‌లాఖ్ అని అంటే ఓ ముస్లిం మ‌హిళ జీవితం నాశ‌నమైపోవాల్సిందేనా.. ఇది స‌బ‌బేనా అని ప్ర‌శ్నించారు.

సీఎం పై ఉగ్రవాదుల దాడి...

  ఇప్పటివరకూ భారత సరిహద్దు ప్రాంతాల్లోనే కాల్పులకు దిగిన ఉగ్రవాదులు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. మణిపూర్ సీఎం ఇబోబి సింగ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అయితే మిలిటెంట్ల కాల్పుల నుండి ఇబోబి సింగ్‌ తృటిలో తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డారు. వివరాల ప్రకారం.... సీఎం ఇబోబి సింగ్ ఉక్రుల్‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంఫాల్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. పక్కనే ఉన్న మణిపూర్ రైఫిల్స్ జవాన్లు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పింది. అయితే వారికి మాత్రం గాయాలయ్యాయి. కాగా కాల్పులకు తెగబడింది ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎం)కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.