జీఎస్టీపై కుదరని ఏకాభిప్రాయం.. మళ్లీ సమావేశాలు
posted on Oct 20, 2016 @ 11:25AM
వచ్చే ఏడాది నుండి జీఎస్టీ బిల్లును అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తో పాటు పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో మాత్రం జీఎస్టీ ఖరారుపై ఏకాభిప్రాయం కుదురనట్టే కనిపిస్తోంది. పన్ను రేటు, విధివిధానాలపై పలు రాష్ర్టాలు పలు అభ్యంతరాలను, అనుమానాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో దీనిపై మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈరోజు జరగాల్సిన సమావేశం రద్దు చేశామని... అయితే నవంబర్ 3, 4 తేదీల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
పన్ను శ్లాబులను 6, 12, 18, 26 శాతాలుగా ప్రతిపాదించారు. నిత్యావసర సరుకులపై అత్యల్పంగా; విలాసవంత వస్తువులపై, పొగాకు, సిగరెట్లు, ఆల్కహాల్ వంటి హానికర పదార్థాలపై అత్యధికంగా పన్ను రేటు విధించాలని భావించారు. అయితే విలాస వస్తువులు, హానికర పదార్థాలపై అత్యధిక పన్ను కాకుండా అదనపు సెస్ విధింపుపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమయిందని తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఐదేండ్లపాటు (2017 ఏప్రిల్ 1 మొదలుకుని) రాష్ర్టాలు నష్టపోయే రెవెన్యూ పరిహారానికి ఈ అదనపు సెస్‌ను వినియోగిస్తారని అన్నారు. ప్రస్తుతం 3 నుంచి 9 శాతం పన్ను వసూలు చేస్తున్న వస్తువులపై ఆరుశాతం పన్ను విధిస్తామని తెలిపారు. వచ్చే 3, 4 తేదీల్లో జరిగే సమావేశంలో పన్ను స్వరూపాన్ని ఖరారు చేస్తామన్నారు.