ఆఫ్గాన్‌లో 30 మందిని కిడ్నాప్ చేసి..ఊచకోత కోసిన ఐఎస్

ఆఫ్గానిస్గాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవలే కాబూల్‌లో దాడికి పాల్పడి సుమారు 80 మంది ప్రాణాలు తీసిన ఐసిస్ ఉగ్రవాదులు తాజాగా మరో ఘటనకు పాల్పడ్డారు.  సెంట్రల్ ఆఫ్గనిస్థాన్‌లోని ప్రొవిన్షియల్ క్యాపిటల్ ఫిరోజ్ కోహ్ ప్రాంతానికి చెందిన సుమారు 30 మందిని అపహరించి వారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం నిన్న స్థానిక ఇస్లామిక్ స్టేట్ కమాండర్‌ను భద్రతా దళాలు అంతమొందించినందుకు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొంది. మృతుల్లో అధికమంది గొర్రెల కాపరులేనని చెప్పింది. ఉదయం గ్రామస్తులు అపహరించిన వారి మృతదేహలను గుర్తించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన వైఎస్సార్సీ ఎమ్మెల్యేలు..

గత వర్షాకాల శాసనసభ సమావేశాల్లో సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభ హక్కుల కమిటీ ముందు హాజరయ్యారు. కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, తంబాల జోగులు, ముత్యాలనాయుడు, సునీల్, సంజీవయ్య హాజరై వివరణ ఇచ్చారు. మరో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున కమిటీ ముందు గైర్హాజరయ్యారు. నిన్న కూడా నలుగురు వైసీపీ సభ్యులు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వగా..కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కరెడ్డి గైర్హజరయ్యారు. కాగా కమిటీ ఎదుట హజరుకాని ముగ్గురు సభ్యుల నుంచి డిసెంబర్ 2న వివరణ తీసుకుంటామని కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. 

గవర్నర్‌తో అఖిలేష్ భేటీ..రాజీనామా ఇవ్వడానికేనా..?

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రోజుకోక మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్‌పై సీఎం అఖిలేష్ వేటు వేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో అమర్‌సింగ్, అఖిలేష్ యాదవ్ వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరిపైనయినా..ఏ క్షణంలోనైనా వేటు పడే అవకాశం ఉందని ఎస్పీ నేతలు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ అఖిలేశ్ యాదవ్ కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుండటంతో అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారని..అందుకోసమే గవర్నర్‌తో సమావేశమయ్యారని రాజకీయవర్గాల్లో వూహాగానాలు వినిపిస్తున్నాయి

అఖిలేష్ నివాసంలో అత్యవసర భేటీ..

సమాజ్‌వాదీ పార్టీలో పుట్టిన ముసలం ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతోంది. రోజు రోజుకు పరిస్థితులు మారుతుండటంతో పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. తాను త్వరలో చేపట్టనున్న రథయాత్రపై నేతలతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు సీఎం. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తుండగా అధికార సమాజ్‌వాదీ పార్టీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. తాజాగా ఆ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో అఖిలేశ్ రథయాత్ర చేయాలని నిర్ణయించారు..మరి ఆ యాత్ర ఏమేరకు విజయవంతమవుతుందో వేచి చూడాల్సిందే.

బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఈ ఉదయం ఉద్రిక్త వాతారణం నెలకొంది. పెండింగ్ స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా కేసీఆర్ ప్రభుత్వం విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటోందంటూ ఏఐఎస్ఎఫ్ నేతలు, కార్యకర్తలు క్వార్టర్స్ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే తమ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించేందుకు విఫలయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, దేశీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఆరంభంలోనే నెగిటివ్‌గా ఉన్న మార్కెట్లు భారీగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో మరింత బలహీనపడ్డాయి. 200 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 28,000 పాయింట్ల మద్ధతు నుంచి, నిఫ్టీ 8650 స్థాయి నుంచి దిగజారింది. సెన్సెక్స్ 27,877 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 8632 వద్ద ట్రేడవుతోంది. అటు అక్టోబర్ డెరివేటివ్ సిరీస్ నిన్నటితో ముగియడంతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ, మెటల్స్ రంగాలు నష్టపోయాయి.  

అవినీతి కేసులో యడ్యూరప్ప‌కు ఊరట..

బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు అవినీతి కేసులో ఊరట లభించింది. బళ్లారి మైనింగ్ కేసులో ఆయనను నిర్ధోషిగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, దీని కోసం రూ. 40 కోట్ల ముడుపులు అందాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహరంలో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికీ యడ్డీ బెయిల్‌పైనే ఉన్నారు. దీనికి సంబంధించిన వాదనలు పూర్తి కాగా యడ్యూరప్ప సహా నలుగురిని నిర్దోషులుగా సీబీఐ కోర్టు తుది తీర్పునిచ్చింది.

అమెరికాకు తొలిసారిగా ఆ పురస్కారం..

ఆంగ్ల సాహిత్యంలో అత్యున్నత పురస్కారంగా భావించే మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇంతవరకు అమెరికా దక్కింది లేదు. ఎందుకంటే బుకర్ ప్రైజ్ నియమావళి ప్రకారం దానిని కామన్‌వెల్త్ దేశాల్లోని రచయితలకు మాత్రమే ఇవ్వాలి. అందువల్ల ఆ పురస్కారం ఇప్పటికి అగ్రరాజ్యానికి అందని ద్రాక్షగానే ఉంది. అయితే ఇప్పుడు ఆ కలను నిజం చేశారు పాల్ బీటీ. ఆయన రచించిన "ద సెల్‌ఔట్" నవలకు ఈ ఏడాది బుకర్ ప్రైజ్ వరించింది. తన స్వస్థలమైన లాస్ ఏంజిల్స్‌ నేపథ్యంగా తీసుకుని జాతుల మధ్య సమానత్వం కోసం వ్యంగ్యంగా పాల్ బీటీ ఈ రచన చేశారని, ఈ నవల దిగ్భ్రాంతికరంగా ఊహించని రీతిలో హాస్యాన్ని పండించిందని జ్యూరీ కొనియాడింది. "మ్యాన్ బుకర్ ప్రైజ్" సంప్రదాయబద్ధంగా కామన్‌వెల్త్ దేశాల రచయితలకు ప్రదానం చేస్తూ వస్తున్నారు. అయితే 2013లో నిబంధనలను మార్చి ఇంగ్లీష్ మాట్లాడే దేశాల రచయితలకు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించడంతో అమెరికాకు తొలిసారిగా ఈ గౌరవం దక్కింది.

ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి అనుమానాస్పద మృతి

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మణిపూర్‌కు చెందిన జేఆర్ ఫిలెమన్ మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు..అతని కోసం తోటి విద్యార్థులు, పోలీసులు తీవ్రంగా గాలించారు. అయితే ఈ ఉదయం బ్రహ్మాపుత్ర హాస్టల్ గది నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా ఫిలెమన్ విగతజీవిగా కనిపించాడు. అయితే ఇప్పటికే నజీబ్ అహ్మద్ అనే విద్యార్థి కనిపించకుండా పోయాడు. నజీబ్ జాడ కోసం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు వైస్ ఛాన్సలర్ సహా సీనియర్ అధికారులను కార్యాలయంలో ఒక రాత్రి మొత్తం నిర్భంధించి ధర్నా నిర్వహించారు. అయితే ఇంతలోనే ఫిలెమన్ మరణం వర్శిటీలో తీవ్ర అలజడిని సృష్టిస్తోంది.

జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. నిన్న కర్నూలులో జరిగిన యువభేరిలో పాల్గొని తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పాల్మాకుల వద్ద జగన్ కారు టైరు ఒక్కసారిగా పంక్ఛర్ అయ్యింది. దీంతో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కు వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపుచేశాడు. వెంటనే కాన్వాయ్‌లోని సిబ్బంది జగన్‌‌కు రక్షణగా నిలిచారు. అనంతరం టైరు మార్చుకుని అదే కారులో జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారు.

విశాఖకు క్యాంట్ ముప్పు...

సరిగ్గా రెండేళ్ల క్రితం హుధుధ్ తుఫాన్ సృష్టించిన విధ్వంసాన్ని మరచిపోకముందే విశాఖకు మరో తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి అధికారులు క్యాంట్ అని నామకరణం చేశారు. ప్రస్తుతం విశాఖకు 685 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన క్యాంట్ వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో, ఎల్లుండి నుంచి తెలంగాణలో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన రాష్ఠ్ర ప్రభుత్వం అన్ని ప్రధాన ఓడరేవుల్లో హెచ్చరికలు జారీ చేసింది.

మహిళా ఇంజనీర్ సజీవ దహనం..

  బీహార్ లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా ఇంజనీరింగ్ ను సజీవ దహనం చేశారు. వివరాల ప్రకారం... బీహార్లో సరితా దేవి అనే మహిళ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ ఆర్ఈజీఏ)లో ముజఫర్ నగర్ లోని మొరౌల్ బ్లాక్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. అయితే కొంత మంది దుండగలు అమెను తన ఇంట్లోనే కుర్చీలో తాళ్లతో కట్టేసి సజీవదహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడం వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు... విచారణ నిమిత్తం ఇంటి యజమాని విజయ్ గుప్తాను తమ కస్టడీలోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. కాగా కొన్నేళ్లుగా ఆమె తన భర్త నుంచి విడిగానే ఉంటోందని.. ఆమెకు ఇద్దరు సంతానమని తెలిపారు.

ఉరీ దాడి మా పనే...

  జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రకటన చేసింది. 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఉరీ ఘటనకు తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా స్పష్టంచేసింది. గత నెలలో ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడి చేసిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఉరీ ఘటనలో మరణించిన ఓ ఉగ్రవాది కోసం లష్కరే తోయిబా మాతృ సంస్థ అయిన జమత్‌-ఉద్‌-దవా(జేయూడీ) పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో గుజ్రాన్‌వాలా ప్రాంతంలో ప్రార్థనలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లలో భారత ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసి ఎల్‌ఈటీకి చెందిన మహ్మద్‌ అనాస్‌ అలియాస్‌ అబు-సరఖా అమరుడయ్యాడని ఉర్దూలో పేర్కొన్నారు. ఈ పోస్టర్ల ప్రకారం ఎల్‌ఈటీ ఉగ్రవాదులు 177 మంది భారత సైనికులను చంపారట. మరి దీనిపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.