శివకాశిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
posted on Oct 20, 2016 @ 3:28PM
శివకాశిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి దగ్గర పడుతోంది. ఇక దీపావళి టపాసుల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శివకాశిలో భారీగా బాణాసంచా తయారీ చేస్తుంటారు. ఈనేపథ్యంలోనే బాణాసంచా నిల్వచేసే ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా..మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 8 మంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ గోడౌన్ పక్కనే ఒక ప్రైవేటు ఆస్పత్రి కూడా ఉంది. గోడౌన్ నుండి మంటలు వ్యాపించడంతో రోగులను వేరేచోటుకు తరలించారు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు.
కాగా శివకాశిలో దాదాపు ప్రతియేటా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సంవత్సరం పొడవునా తయారుచేసిన టపాసులను శివారు ప్రాంతాల్లోని గోడౌన్లలో నిల్వచేస్తుంటారు. దీపావళి సమీపిస్తుండటంతో విక్రయాలు భారీఎత్తున కొనసాగుతుంటాయి. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు కూడా టపాసులు సరఫరా చేస్తుంటారు.