జగన్ పై 'జగన్నాయకుడు' సినిమా
posted on Apr 18, 2011 9:03AM
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం త్వరలో రానుందని సమాచారం. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం కాంగ్రెసులో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, అనంతరం ఆయన పార్టీ వీడటం, ఆ తర్వాత పార్టీ పెట్టడం తదితర విషయాలు పొందు పరుస్తూ శ్రీరామ్ అనే దర్శకుడు చిత్రం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి జగన్నాయకుడు అనే పేరును కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీరామ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి మంచి అభిమాని. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు మరింత ఆకర్షితుడయ్యాడంట. ఆయనను వైయస్ మృతి తీవ్రంగా కలిచి వేసింది. అయితే వైయస్ మృతి తర్వాత జగన్‌ను ఆయన బాగా ఆరాధించాడు. అయితే అలాంటి జగన్ ఎంపీగా కాంగ్రెసు పార్టీని విభేదించి బయటకు వచ్చి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీని పెట్టాడు. ఇడుపుల పాయ వద్ద ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేపట్టిన ఓదార్పు యాత్ర, కాంగ్రెసులో ఉన్నప్పుడు పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టిన ఓదార్పు, తండ్రి ఆశయాలు సాధించే వ్యక్తిగా ఇలా ఈ సంవత్సరంన్నరగా జగన్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన జగన్నాయకుడులో పొందు పర్చనున్నారని సమాచారం.