వేటు వేస్తే సగం ఖాళీ: సబ్బం హరి

కడప: శాసనసభ్యులపై అనర్హత వేటు వేసే ప్రక్రియను కొనసాగిస్తే శాసనసభ సగం ఖాళీ అవుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్తున్న నలుగురు శాసనసభ్యులపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరడంపై ఆయన ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆ విధంగా అన్నారు. చర్యలు తీసుకునే అధికారం అఖిల భారత కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి)కి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసుతో తెగదెంపులేనని ఆయన అన్నారు. మార్పులున్నాయి కాబట్టే కడప ఉప ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కడప ఉప ఎన్నికల వల్ల ఏ విధమైన మార్పులు చోటు చేసుకోవని ఆయన అన్నారు.

సోనియాపై మండిపడ్డ రోజా

కడప: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆస్తి కోసం సొంత తోటికోడలు మేనకా గాంధీని సోనియా గాంధీ ఇంటి నుంచి వెళ్లగొట్టారని రోజా ఆరోపించారు. తన భర్తను చంపించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీకి మద్దతు తెలిపి నీచరాజకీయం చేసింది సోనియానే అని ఆమె అన్నారు. రాజీవ్ గాంధీని ఉరి తీయాలని లోక్‌సభలో డిమాండ్ చేసిన జైపాల్‌రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టి తన పక్కన కూర్చొబెట్టుకున్న ఘనత సోనియాకే చెందుతుందన్నారు. సొంత జిల్లాలో ఎమ్మెల్సీని గెలిపించుకోలేని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కడపలో ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు. తన పదవిని కాపాడుకోవడానికి సీఎం మంత్రులను కడపలో కాపురం పెట్టించారన్నారు. జగన్ మడమ తిప్పని, మాట తప్పని నాయకుడు అని రోజా కితాబిచ్చారు.

జగన్‌ స్వార్థం వల్లే ఉపఎన్నికలు

కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి అధికార పిచ్చిపట్టిందని రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. ఆయన స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. అందువల్ల ఓటర్లు కాస్త విజ్ఞతతో ఆలోచన చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన కడప జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అనునిత్యం సోనియాగాంధీని పొగుడుతూ ఆమె అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ సిఎం గా పనిచేసిన వైఎస్ ప్రజల అభిమానాన్ని సంపాదించాడన్నారు. వైఎస్ వేరు కాదు, కాంగ్రెస్ పార్టీ వేరుకాదని వైఎస్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమని ఆయన చెప్పారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కాంగ్రెస్‌వేనని, వాటి అమలు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేనని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనునిత్యం అందుబాటులో ఉండే డిఎల్ రవీంద్రారెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

బెడిసి కొట్టిన కిరణ్ వ్యూహం!

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారానికి మహిళా మంత్రులను పులివెందులలో దించాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం కూడా బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేయలేమనే కన్నా వైయస్ విజయమ్మకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేమని వారు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పినట్లు సమాచారం. విజయమ్మకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తమ పట్ల వ్యతిరేకత ఎదురవుతుందని వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, మహిళా మంత్రులు చాలా మంది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే రాజకీయాల్లో ప్రధాన పోషించగలుగుతున్నారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వంటి మహిళా మంత్రులకు రాజశేఖర రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. వైయస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం కూడా వారిని వెనక్కి లాగుతున్నట్లు చెబుతున్నారు. వైయస్ విజయమ్మతో మహిళా మంత్రులకు చాలా మందికి దగ్గరితనం ఉంది. అందువల్ల ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం తమ వల్ల కాదని అంటున్నట్లు తెలుస్తోంది.

సోనియా కరుణతోనే జగన్ కోటీశ్వరుడు

కడప: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరుణా కటాక్షాలతోనే వైఎస్.జగన్మోహన్ రెడ్డి కోటీశ్వరుల జాబితాలో చోటు దక్కించుకున్నాడని కడప లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి, రాష్ట్రమంత్రి డీఎల్.రవీంద్రా రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని అటు పదవులు, ఇటు ప్రతిష్టలు పొందిన జగన్ కుటుంబం నేడు ఆ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్‌లో 30 సంవత్సరాలు దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పలు పదవులు పొందారని గుర్తు చేశారు. అలాంటి వైఎస్ తనయుడు జగన్మోహన్‌ రెడ్డి సోనియాగాంధీని ఇటలీతో పోలుస్తూ మాట్లాడాన్ని జీర్ణించుకోలేక పోతున్నట్టు చెప్పారు. తండ్రి అధికారంలో ఉండగా కోట్లకు పడగలెత్తిన జగన్ ఇపుడు ఆ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేసి తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న జగన్మోహన్‌రెడ్డి, విజయలక్ష్మిలు గత రెండు సంవత్సరాలు పదవిలో ఉండి ప్రజలకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ కి పదవి కట్టబెడితే రాష్ట్రాన్ని దోచుకుంటాడన్నారు.

కాంగ్రెస్ ను గెలిపించాలన్న రోశయ్య

కడప: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఏ రోజు కూడా పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించలేదని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. తాను 1972 నుంచి వైయస్‌తో ఉన్నానని, వైయస్ రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసిన సందర్భాలున్నాయి గానీ అఖిల భారత కాంగ్రెసు నాయకత్వాన్ని ఏనాడూ విమర్శించలేదని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కడప లోక్ సభ, పులివెందుల శాసనసభ స్థానాల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. కాంగ్రెసును ఓ ప్రత్యేక కోణంలో చూడాలని ఆయన సూచించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్ని ఖచ్చితంగా అమలు అవుతాయన్నారు. వైఎస్ రాజకీయ వారసత్వం ముమ్మాటికీ కాంగ్రెస్‌దేనని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రయోజానాలు ఎక్కువ చేకూరుతాయని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీతో ఇతర ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను బేరీజు వేసుకుని కాంగ్రెసును బలపరచాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలను కూడా బేరీజు వేసుకుని ఓటు వేయాలని ఆయన సూచించారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసిందన్నారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందని ఆయన అన్నారు.

టైమ్ టాప్‌ హండ్రెడ్‌లో ధోనీ

వాషింగ్టన్: 'మిస్టర్ కూల్'గా పేరొందిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేందర్‌సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక 'టైమ్ మ్యాగజైన్'  ఈ ఏడాదికి గానూ రూపొందించిన ప్రపంచంలోనే 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఈ జార్ఖండ్ కుర్రాడు 52వ స్థానం సంపాదించుకున్నాడు. 28 ఏళ్ల తరువాత భారత క్రికెట్ జట్టు ప్రపంచ్ కప్‌ను కైవసం చేసుకోవడానికి కారకుడైన దోనీపై టైమ్స్ పత్రిక.. ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించింది. "భారత క్రికెట్ జట్టుకు ఇంత వరకు నాయకత్వం వహించిన కెప్టెన్లు అందరిలోకీ.. అత్యుత్తమమైన కెప్టెన్‌గా దోనీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మైదానంలో ప్రశాంత చిత్తంతో ఉండటంలోనే కాకుండా వినమ్రతలోనూ అతడికి అతటే సాటి. అతడు కేవలం భారత్‌కు ప్రపంచ్ కప్‌ను సాధించడమే కాదు.. ఎలా గెలవాలో కూడా తన దేశానికి నేర్పాడు'' అని టైమ్స్ కొనియాడింది. కాగా.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, బ్రెయిన్ మ్యాపింగ్ నిపుణుడు వి.ఎస్.రామచంద్రన్, సామాజిక వేత్త అరుణా రాయ్‌లు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వ్యాపార కుశలతలో ముకేశ్ అంబానీ, వితరణలో అజీమ్ ప్రేమ్‌జీలకు మరెవరూ సాటిరారని టైమ్స్ పేర్కొంది. అవినీతిలో కూరుకుపోయిన భారత ప్రభుత్వ యంత్రాంగంలో మార్పుతేవడానికి సామాజిక వేత్త అరుణా రాయ్ చేస్తున్న కృషి అమోఘమైనదని ఈ పత్రిక శ్లాఘించింది. కాగా.. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషాకు కూడా ఈ జాబితాలో స్థానం (17వ స్థానం) దక్కింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం ఈ జాబితాలో.. 86వ స్థానంలోకి పడిపోయారు. మరో వైపు.. ఆయన ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి హిలరీ క్లింటన్ మాత్రం 43వ స్థానంలో ఉండటం విశేషం. అరబ్బు ప్రపంచాన్ని కుదిపేసేలా.. ఈజిప్ట్‌లో ప్రజా విప్లవం రావడానికి ఆన్‌లైన్ ద్వారా దోహదపడ్డ 'గూగుల్' సంస్థ ఎగ్జిక్యూటివ్ వేల్ గోనిమ్‌కు ఈ జాబితాలో ప్రథమ స్థానం లభించింది. తన పరిశోధనలతో పాత్రికేయ రంగంలో సంచలనాలను సృష్టిస్తున్న వెబ్‌సైట్ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజ్‌కు ఈ జాబితాలో 9వ స్థానం లభించింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో విప్లవానికి తెరదీసిన 'ఫేస్‌బుక్' వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బెర్గ్ 6వ స్థానంలో నిలిచారు.

కడప కోసం సచివాలయం మూత

తిరుపతి: కడప ఉప ఎన్నికల కోసం ప్రజాసమస్యలను సైతం పక్కనపెట్టి రాష్ట్ర సచివాలయాన్ని మూత వేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం కిరణ్ కుర్చీకి, కడప ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం ముడిపెట్టిందన్నారు. దీంతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. అందరికీ కడప ఎన్నికల ఓటమి భయం పట్టుకుని అక్కడే చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీలు ఉప ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారా లేదా అన్నది ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని చెప్పారు. కడప ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఎవరికి మద్దతునిచ్చేది త్వరలో ప్రకటిస్తామన్నారు. కడప జిల్లా కమిటీతో చర్చించి వారి అభిప్రాయాలకనుగుణంగా సీపీఎం ఉప ఎన్నికల విధానం ప్రకటిస్తామని తెలిపా రు. పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్యం విషయంలో ట్రస్టు సభ్యులు అసత్యాలు చెబుతున్నారని రాఘవులు విమర్శించారు.

చిరంజీవికి శోభారాణి వార్నింగ్

హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన ఆ పార్టీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శోభారాణి చిరంజీవిపై మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుండటంపై గతంలోనే తన వ్యాఖ్యలతో చిరంజీవిని చీల్చిచెండాడిన శోభారాణి తాజాగా మరో లేఖ సంధించారు. అందులో చిరంజీవికి వార్నింగ్ కూడా ఇచ్చారు. పార్టీలో ఉన్న మా అభిప్రాయాలు తెలుసుకోకుండా విలీనం ఎలా ప్రకటిస్తారని ఆ లేఖలో చిరంజీవిని ప్రశ్నించిన శోభారాణి...చిరంజీవి త్వరలో ఏర్పాటు చేయనున్న విలీన సభను ఆదుకుంటామని హెచ్చరించారు. పార్టీ విలీన సభకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వస్తే ఆమెను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు.

పోలీసుల నియంత్రణలోకి పుట్టపర్తి

పుట్టపర్తి : పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంతోపాటు సత్యసాయిబాబా చికిత్స పొందుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలను పోలీసులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. హెలిప్యాడ్‌లను సిద్ధం చేస్తున్నారు. బందోబస్తు కోసం జిల్లావ్యాప్తంగా పోలీసులే కాకుండా కర్నూలు, చిత్తూరు, గుంటూరు ప్రాంతాలకు చెందిన పోలీసులు కూడా తరలివచ్చారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేయడానికి బిగ్ స్క్రీన్లు తెప్పించారు. వాటి ఏర్పాట్లలో సిబ్బంది తలమునకలయ్యారు. కట్టుదిట్టంగా బ్యారికేడ్లను నిర్మిస్తున్నారు. కర్నూలు నుంచి పోలీసు బ్యాండ్ పార్టీ చేరుకుంది. జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం కావడమే కాకుండా.. సెలవులు ఉండవని కూడా ఆదేశాలు జారీ చేశారు. పుట్టపర్తిలో శుక్రవారం పరిస్థితి ఇది. దీంతో, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పోలీసుల హడావిడి, అధికార యంత్రాంగం మల్ల్లగుల్లాలు, ట్రస్ట్ సభ్యుల సమావేశాలు.. తదితర వ్యవహారాలు భక్తులను ఆందోళనలో పడేశాయి. పుట్టపర్తిలోని ఏర్పాట్లను మంత్రి గీతారెడ్డి, కలెక్టర్ జనార్దన్‌రెడ్డి, ఐజీ సంతోష్ మెహ్రా, డీఐజీ చారుసిన్హా, ఎస్పీ షానవాజ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్త్తున్నారు. ఒకవైపు పోలీసుల హడావిడి కొనసాగుతుండగానే.. మంత్రి గీతారెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి, ఐజీ సంతోష్ మెహ్రా, డీఐజీ చారుసిన్హా, కలెక్టర్ జనార్దన్ రెడ్డి, ఎస్పీ షానవాజ్ ఖాసీంలతో ట్రస్ట్ వర్గాలు సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఏదైనా కీలక ప్రకటన చేయాల్సి వస్తే చేపట్టబోయే ఏర్పాట్లపై కూడా వారు సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి. ఒక్క పోలీసు శాఖలోనే కాకుండా ఎంపీడీవోలు, తహసీల్దార్‌లతోపాటు ఇతర శాఖలకు చెందిన ముఖ్య అధికారులందరినీ ఎప్పుడు పిలిచినా పుట్టపర్తికి వచ్చేలా హెడ్ క్వార్టర్లలో సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో, పుట్టపర్తిలో విషాద వాతావరణం నెలకొంది. అయితే, బాబా ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఆయనను చూడడానికి వీవీఐపీలు వస్తే అప్పటికప్పుడు బందోబస్తు చేపట్టడం కష్టమని. దీనిని దృష్టిలో పెట్టుకునే ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు: జగన్

కడప: భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కడప జిల్లా రోడ్ షోలోస్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నామని కాంగ్రెస్ దుష్ర్పచారం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. తన తల్లి విజయమ్మను, తనను ఓడించడానికి కాంగ్రెసు నీతిమాలిన చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలలో తమను ఎదుర్కొనలేక అసత్య ఆరోపణలు గుప్పిస్తుందని అన్నారు. కడప జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీకి చెందిన 7వేల మంది కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెట్టి వేధిస్తుందని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టుకుంటూనే మరోవైపు పులివెందులలో తన తల్లిపై బాబాయి వివేకానందరెడ్డిని పోటీకి దింపడం కాంగ్రెసు దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో వస్తున్న అందరి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కొందరిపైనే చర్యలు తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తనతో వస్తున్న అందరు ఎమ్మెల్యేలపై ఒకేసారి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

బాబా ఆరోగ్యంపై చివరి ప్రయత్నాలు

హైదరాబాద్: పుట్టపర్తి సత్యసాయి బాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని మంత్రి రఘువీరా రెడ్డి వెల్లడించారు. సత్యసాయి ఆరోగ్యం విషయంలో వైద్యులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. బాబా శరీరంలో ఎక్కువ అవయవాలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించారు. సత్య సాయిబాబా ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నదని ఆయన అన్నారు. సత్య సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, నిఘా ఐడి గురువారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు.

ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే పై చేయి

హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు మంత్రి పార్థసారధి విడదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఫలితాలలో అమ్మాయిలదే పై చేయిగా ఉంది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణత శాతం 52.21గా ఉంది. అందులో 56.61 శాతం అమ్మాయిలది కాగా, 48.48 శాతం అబ్బాయిల ఉత్తీర్ణత శాతం ఉంది. మొదటి సంవత్సరం పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 లక్షల యాభైవేల మంది విద్యార్థులు రాశారు. అందులో 77వేల మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు రాసిన వారిలో 4 లక్షల 44వేల మంది విద్యార్థులు పాసయ్యారు. కాగా ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడారు. ఈ నెల 25వ తారీఖు నుండి మెమోలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. స్థానిక ఆర్ఐఓ వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పారు. పాసైన వారు ఇంప్రూమెంట్ రాసుకోవచ్చునని అయితే ఫెయిలైతే మాత్రం ఫెయిల్ కిందే లెక్క అని చెప్పారు. కాగా ఫలితాలలో మొదటిస్థానంలో కృష్ణా జిల్లా, చివరి స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. కృష్ణా జిల్లా 70 శాతం ఫలితాలను సాధించగా, నల్గొండ 34 శాతం ఫలితాలు సాధించింది.

అవినీతిని ధైర్యంగా ఎదుర్కోవాలి: ప్రధాని

న్యూఢిల్లీ: దేశంలో అవినీతి సవాలుగా మారిందని, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. పెచ్చుమీరుతున్న అవినీతిపై ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జన్ లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మన్మోహన్‌సింగ్ తెలిపారు. అవినీతి నిరోధానికి ప్రస్తుత చట్టాలు, వ్యవస్థలు సమర్ధంగా పనిచేయట్లేదనే భావన ప్రజల్లో పెరుగుతోందని అన్నారు. అనంతరం మన్మోహన్ ఎక్సలెన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవార్డులను ప్రదానం చేశారు.

ప్రభుత్వానికి ఆగస్టులో సంక్షోభం: రోజా

హైదరాబాద్: ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షోభం తప్పదని సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా  ఓ టీవీ ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో హెచ్చరించారు. ఉప ఎన్నికలలో జగన్, విజయమ్మ బంపర్ ఆధిక్యంతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ జగన్ ఎమ్మెల్యేలను సామ, ధాన, బేధ, దండోపాయాలతో తన వద్దకు రప్పించుకోవాలని అనుకుంటోందని, అయితే ఎమ్మెల్యేలు అన్నింటికీ సిద్ధమయ్యే జగన్ వెంట నడుస్తున్నారని చెప్పారు. జగన్ గెలుపు ఖాయమని తెలిసినప్పటికీ కాంగ్రెసు మంత్రులను కడపలో మోహరించిందని చెప్పారు. ఓట్ల ద్వారా కాంగ్రెసుకు బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ వర్గ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ముందు కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి వైయస్ ఫోటో లేకుండా సోనియా ఫోటోతో గెలవాలని సవాల్ విసిరారు. కాంగ్రెసు అవసరానికి అనుగుణంగా ప్లేటు ఫిరాయిస్తుందని ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ మాటల్లో, చేతల్లో నైతికత లేదన్నారు. రాజకీయ అక్కసుతోనే జగన్‌ను విమర్శిస్తున్నారని అన్నారు. తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని అయితే పార్టీ ఆదేశిస్తే తప్పదన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కడప ఉప ఎన్నికలలో ప్రచారం చేయడం వల్ల కాంగ్రెసు పార్టీ కంటే జగన్ కే ఎక్కువ లాభిస్తుందని రోజా చెప్పారు. కాంగ్రెసును విమర్శించి 18 సీట్లు గెలుచున్న చిరంజీవి ఇప్పుడు అదే కాంగ్రెసుకు ప్రచారం చేయడాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, దానిపై చిరంజీవిని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెసు, పిఆర్పీ అవకాశవాదంలో కలిసిపోయిన విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాసుకు రెండు సార్లు ఓడిపోయినా బుద్ది రాలేదని  మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత రెహ్మాన్ విమర్శించారు. నిజామాబాద్‌లో ముస్లింలు డిఎస్‌ను రెండుసార్లు ఓడించారని అన్నారు. అయినా డిఎస్‌కు బుద్ది రాకపోవడం శోచనీయం అన్నారు. జగన్‌కు, ముస్లింలకు మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే కాంగ్రెసు పార్టీకి మరోసారి పరాభవం తప్పదని హెచ్చరించారు. కాగా ఇటీవల పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జగన్నాటకం వెనుక బిజెపి హస్తం ఉందని, రాష్ట్రంలో జగన్‌ను అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.