దమ్ముంటే చర్యలు తీసుకోండి
posted on Apr 18, 2011 @ 11:02AM
హైదరాబాద్: పార్టీ ధిక్కరణ చర్యల పేరుతో తమపై అనర్హత వేటు వేస్తామంటూ కాంగ్రెస్ అధినాయకత్వం చేస్తున్న తాటాకు చప్పుళ్ళకు బెదిరే ప్రసక్తే లేదని జగన్ వర్గానికి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి నొక్కివక్కాణించారు. దమ్ముంటే.. మాటలు కట్టిపట్టి చర్య తీసుకోవాలని ఆయన సవాల్ విసిరారు. జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలో కొందరిపై అనర్హత వేటు వేసే విషయంపై డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చర్యలు ప్రారంభించినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేసి అభ్యర్థిని గెలిపించుకోవడంలో విఫలమైన ఎమ్మెల్యేలపై చర్యతీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఓడిన వారిపై చర్యలు తీసుకోకుండా గెలిచిన వారిపై అనర్హత వేటు వేయడమా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, అసెంబ్లీ బయట వైఎస్.జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారన్నారు.