పార్లమెంటే సుప్రీం: హజారే
posted on Apr 18, 2011 9:24AM
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తన వైఖరిని కాస్త సడలించుకున్నారు. పార్లమెంటే సుప్రీం అని, లోక్‌పాల్ బిల్లును తిరస్కరిస్తే దాని నిర్ణయాన్ని అంగీకరిస్తానని వ్యాఖ్యానించారు. 'ఆగస్టు 15 డెడ్‌లైన్'పైనా మెత్తబడ్డారు. ప్రభుత్వం సరైన దిశలో ఉందని భావిస్తే దాన్ని పెంచడానికి తాను సుముఖమేనని చెప్పారు. ఎంపిక చేసిన మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. నెల రోజుల్లోనే బిల్లుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన ఉద్యమ విధివిధానాలు 'ఉగ్రవాదాన్ని' పోలి ఉన్నాయన్న వ్యాఖ్యను ఆయన అంగీకరించారు. లోక్‌పాల్ బిల్లుపై రాజకీయ పార్టీల అధినేతలతో చర్చించేందుకు సిద్ధమేనని చెప్పారు. లోక్‌పాల్ బిల్లుతో అవినీతి అంతమైపోదని, కొంతమేరకు నియంత్రించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని వివరించారు. ఆర్ఎస్ఎస్‌తో తనకు సంబంధాలు ఉన్నాయన్న విమర్శలను హజారే కొట్టిపారేశారు. అవినీతి వ్యతిరేక ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో తాను పర్యటించనున్నానని వెల్లడించారు. రాజకీయ పార్టీని స్థాపించే యోచన గానీ, పోటీ చేసే యోచన గానీ లేవని కుండబద్దలు కొట్టారు. కాగా, తాను కుళ్లిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కృషి చేస్తున్నట్టు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను హజారే స్వాగతించారు. దేశాభివృద్ధి కోసం అలాంటి యువత ముందుకు రావాలని కోరారు.