పుట్టపర్తిలో 144 సెక్షన్
పుట్టపర్తి : పుట్టపర్తిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. బాబా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందనే వార్తలు వెలువడంతో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. బుధవారం రాత్రికే సుమరు 4 వేల మంది పోలీసులు పుట్టపర్తికి చేరుకున్నారు. చెక్ పోస్ట్ ల వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యుల ప్రకటనల నేపథ్యంలో పుట్టపర్తికి భారీసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
కాగా, బాబా ఆరోగ్య పరిస్థితులపై వైద్యుల ప్రకటనల నేపథ్యంలో గురువారం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న ట్రస్టు సభ్యులను పుట్టపర్తికి పిలిపిస్తున్నట్లు సమాచారం. ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి, సభ్యులు ఎస్వీ గిరి, రత్నాకర్ పుట్టపర్తిలోనే ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు ఇందులాల్‌షా, జస్టిస్ భగవతి, శ్రీనివాసన్‌లు గురువారం రానున్నారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్ సభ్యులు నాగానంద, జేవీ శెట్టి, భగవత్‌లకు సమాచారం పంపినట్లు తెలిసింది. పుట్టపర్తిలో జరిగే ట్రస్టు సమావేశానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. సత్య సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు, చికిత్స ద్వారా ప్రాణాలు నిలబెట్టడం సాధ్యం కానట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఏం చేయాలనే విషయంపై చర్చించేందుకు సత్య సాయి ట్రస్టు అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబా భక్తుల్లోని ప్రముఖులు హైదరాబాదులో సమావేశమయ్యారు.