‘రచ్చబండ’కే దిక్కులేదు.. మళ్లీ ప్రజాపథమా?
posted on Apr 18, 2011 @ 10:15AM
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిష్కరించకుండానే ప్రజాపథం నిర్వహించడం ఎందుకని సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రచ్చబండలో కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటినన్నింటిని మూలనబెట్టిన సర్కారు మళ్లీ కొన్ని కోట్ల ఖర్చుతో ప్రజాపథం నిర్వహించడం ఎవర్ని వంచించడానికని నిలదీశారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు రాష్ట్రం అప్పుల్లో ఉందంటూనే.. మరోవైపు ఈ తూతూ మంత్రం ప్రచార కార్యక్రమాలు చేయడం వల్ల ఉపయోగమేమీ ఉండబోదని అన్నారు. గ్రామాల్లో మంచినీటి కొరత, కరెంటు కోతలు, గిరిజన, దళిత ఆవాసాల దుస్థితి, కనీస వేతనాలకోసం కార్మికుల అగచాట్లు, రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపులు వంటి సవాలక్ష సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని, వాటినన్నింటిని పరిష్కరించి ప్రజాపథానికి వెళ్లాలని జూలకంటి సూచించారు. గతంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండానే మళ్లీ 'ప్రజాపథాన్ని' ఏ ముఖం పెట్టుకుని ప్రారంభిస్తారంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బండారు దత్తాత్రేయ సీఎంను ప్రశ్నించారు. ఆదివారం ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి 18వ బహిరంగ లేఖ రాశారు.